హైదరాబాద్, డిసెంబర్ 28 : మీరు రిజర్వేషన్ చేయించుకున్న రైలు మిస్సయ్యిందా, లేదా హఠాత్తుగా చేయాల్సిన ప్రయాణానికి రిజర్వేషన్ లేదా? ఆందోళన చెందొద్దు. అలాంటి వారి కోసమే భారతీయ రైల్వే కరెంట్ బుకింగ్/కరెంట్ అవైలబిలిటీ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల ఆఖరి నిమిషంలో ప్రయాణం పెట్టుకున్న వారికి కూడా రిజర్వేషన్ సౌకర్యం (సీట్లు/బెర్త్‌ల లభ్యత ఉంటే) లభిస్తుంది.
ఈ కొత్త సౌకర్యం ప్రకారం ప్రయాణికులు రైలు ప్రయాణ సమయానికి నాలుగు గంటల ముందు నుంచి ఆఖరి చార్ట్ (సాధారణంగా ఇది రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు ఉంటుంది) తయారు చేసే వరకు రిజర్వేషన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ కరెంట్ బుకింగ్ టికెట్లను ఆన్లైన్లో, ఆయా స్టేషన్లలోని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లలో తీసుకోవచ్చు. ఈ టికెట్లకు సాధారణ చార్జీలే తప్ప ఎలాంటి అదనపు రుసుం తీసుకోరు. ఏసీ, స్లీపర్ సహా అన్ని తరగతులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.