Indians in Ukraine | ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను ఖతార్ మీదుగా స్వదేశానికి తరలిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్‌ను మూసేసింది. ఎయిర్ స్పేస్‌ను పునః ప్రారంభించిన తర్వాతే ఉక్రెయిన్‌కు పౌర విమానాలు వెళతాయని కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.
ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 20 వేల మంది ఇండియన్స్ చిక్కుకున్నారు. వారిలో అత్యధికులు విద్యార్థులే కావడం గమనార్హం. ఉక్రెయిన్ నుంచి ఖతార్‌కు.. ఖతార్ నుంచి భారతీయులు స్వదేశానికి రావాల్సి ఉంటుంది. అయితే, గగనతలాన్ని మూసేసినందున భారతీయులు ఉక్రెయిన్ నుంచి ఖతార్‌కు రావడమే సమస్యగా మారింది.
ఉక్రెయిన్ నుంచి ఖతార్‌కు వచ్చిన భారతీయులను స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించాయని ఖతార్‌లో భారత్ ఎంబసీ తెలిపింది. భారత్-ఖతార్ మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం రెండుదేశాల మధ్య విమాన సర్వీసులు నడుస్తాయి.