Murder : టీవీ రిమోట్ (TV remote) కోసం గొడవపడి తల్లిని హత్యచేసిన భారత సంతతి వ్యక్తికి యూకే (UK) లోని బర్మింగ్‌హామ్ కోర్టు (Birmingham court) యావజ్జీవ కారగారశిక్ష (Life imprisonment) విధించింది. అదేవిధంగా 15 ఏళ్ల శిక్షాకాలం పూర్తయ్యే వరకు అతడికి పెరోల్ (Perol) కూడా ఇవ్వరాదని ఆదేశించింది.
భారత సంతతికి చెందిన సుర్జీత్ సింగ్ (39) తన తల్లి మొహిందర్ కౌర్ (76) తో కలిసి బర్మింగ్‌హామ్‌లో ఉండేవాడు. తల్లి బాగోగులు చూసుకుంటూ మరే పని లేకుండా తిరిగేవాడు. నిత్యం మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌లో టీవీ రిమోట్ విషయమై తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. రిమోట్ ఇవ్వడంలేదని మొహిందర్ కౌర్ తన కొడుకు సుర్జీత్‌ను దూషించింది.
దాంతో ఆగ్రహానికి లోనైన సుర్జీత్ సింగ్ తల్లిపై దాడికి పాల్పడి చంపేశాడు. అనంతరం తన బంధువుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బంధువు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని చూసేసరికి మొహిందర్ కౌర్ రక్తపు మడుగులో పడి ఉంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. పారిపోయిన నిందితుడు పోలీసులు అక్కడ ఉండగానే తిరిగి రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తి కావడంతో బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టు నిందితుడికి శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష వేసింది.