Murder : కెనడా (Canada) లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. దిల్ రాజ్ సింగ్ గిల్ (Dilraj Singh Gill) అనే 28 ఏళ్ల వ్యక్తిని గుర్తుతెలియని దుండుగులు హతమార్చారు. ఈ ఘటన బ్రిటిష్ కొలంబియాలోని బర్నబే వద్ద చోటుచేసుకుంది. వాంకోవర్ వాసి అయిన దిల్రాజ్ హత్యకు గ్యాంగ్ వార్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నెల 22న ‘3700 కెనడా వే’ లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకునేసరికి అక్కడ ఓ వ్యక్తి రక్తపుమడుగులో పడి ఉన్నాడు. అతడిని కాపాడేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆ తర్వాత బక్స్టోన్ వీధిలో ఓ వాహనం తగలబడటాన్ని అధికారులు గుర్తించారు.
ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా గిల్ అక్కడి పోలీసులకు తెలిసిన వ్యక్తి కావడం గమనించదగిన విషయం.