INS Taragiri : ఇండియన్ నేవీ (Indian Navy) లో అత్యాధునిక ‘మిస్సైల్ పవర్ హౌస్ (Missile Power House)’ చేరబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ తారాగిరి (INS Taragiri)’ ఏప్రిల్ 3న అధికారికంగా నౌకాదళంలో ప్రవేశించనుంది. ఈ విషయాన్ని రక్షణరంగ అధికారులు తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, రాడార్ల వ్యవస్థతో నిర్మించిన ఈ యుద్ధ నౌక విశాఖపట్నం (Vishakapatnam) లో జరిగే కమిషన్ కార్యక్రమంలో రక్షణమంత్రి (Deffence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చేతులు మీదుగా నేవీ అమ్ములపొదిలో చేరుతుంది.
మన దేశం యుద్ధ నౌకల నిర్మాణం, రూపకల్పనలో స్వయంసమృద్ధి శక్తిగా ఎదుగుతోందని చెప్పడానికి తారాగిరి నిదర్శనం. ఈ నౌక 6,670 టన్నుల బరువు ఉంటుంది. ప్రాజెక్టు 17ఎ క్లాస్‌లో ఇది నాలుగో నౌక. మజ్గావ్ డాక్ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ నిర్మించిన మూడో నౌక. కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్లాంట్‌తో నడిచే తారాగిరి, అధిక వేగం, అత్యధికకాలం ప్రయాణించే శక్తితో బహుముఖ నౌకా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రపంచస్థాయి ఆయుధాగారం ఈ నౌక సొంతం. ఇందులో సూపర్సోనిక్ వేగం కలిగిన బ్రహ్మోస్ వంటి ఉపరితలం నుంచి ఉపరితలపైకి ప్రయోగించే క్షిపణులు, మధ్యస్థ స్థాయి ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణులు, ఒకేసారి పలు లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగల మల్టీ ఫంక్షన్ రాడార్, ప్రత్యేకతలతో కూడి శత్రు జలాంతర్గాములపైకి దాడి చేయగల యుద్ధసామగ్రి ఉంటాయి.
శత్రు దాడులను సిబ్బంది క్షణాల్లో తిప్పికొట్టేలా కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టంతో వీటిని అనుసంధానించారు. మునుపటి డిజైన్ల కన్నా ఎంతో ఆధునికంగా రూపొందించిన ఈ యుద్ధనౌక.. శత్రు రాడార్లకు చిక్కకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది. ఈ నౌకలో 75 శాతంపైగా స్వదేశీ పరికరాల వినియోగంలో 200కుపైగా ఎంఎస్ఎంఈ సంస్థలు పాలుపంచుకున్నాయని, వేలాది మందికి ఉపాధి లభించిందని అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఆత్మనిర్భరత కార్యక్రమానికి, స్వదేశీ నౌకాశ్రయాల అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలకు ఇది ప్రతిరూపమని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. సముద్ర జలాల్లో అగ్రశ్రేణి వేటగాడిగానే కాకుండా, ఆధునిక దౌత్యంలోని సంక్లిష్టతలను, మానవీయ సంక్షోభాలను ఎదుర్కోవడానికి తారాగిరిని నిర్మించినట్లు అధికారులు చెప్పారు.