న్యూఢిల్లీ: సంప్రదాయ డీజిల్, ఎలక్ట్రిక్‌తో పాటు అత్యాధునిక అణు జలాంతర్గాముల నిర్మాణం, నిర్వాహణపై భారత నేవీ దృష్టిసారిచింది. మన చుట్టూ ఉన్న శ్రతు దేశాల ముప్పు, బెదిరింపులను ఎదుర్కోవడానికి భారత నావికాదళం అణు, సంప్రదాయ జలాంతర్గాములను కలిపి నిర్వహిస్తుందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి సోమవారం చెప్పారు. సంప్రదాయ డీజిల్, ఎలక్ట్రిక్ సబ్మెరైన్లను ఫ్రాన్స్ నుంచి సమకూర్చుకునే 90 మిలియన్ డాలర్ల డీల్‌ను ఆస్ట్రేలియా రద్దు చేసింది. కేవలం అణు జలాంతర్గాముల నిర్మాణం కోసం అమెరికాతో కొత్త ఒప్పందం చేసుకున్నది.
ఇటీవల జరిగిన ఈ పరిణామం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారి దీనిపై స్పందించారు. ‘ఆస్ట్రేలియాకు, మహా సముద్రాలు, ఆ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రాంతాల (ముఖ్యంగా చైనా) నుంచి ముప్పు ఎక్కువ. సంప్రదాయ జలాంతర్గామి ఒప్పందాన్ని రద్దు చేసుకునే నిర్ణయం వారికి అర్థవంతంగా ఉంటుంది. భారత్ విషయానికి వస్తే సముద్రాలతోపాటు తీర ప్రాంతాల్లో కూడా అలాంటి బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకే భారత నావికాదళం అణు, సంప్రదాయ జలాంతర్గాములను కలిగి ఉండే ఒక సబ్‌మెరైన్ దళాన్ని నిర్మిస్తుంది’ అని ఏఎన్ఐ వార్తా సంస్థకు ఆయన చెప్పారు.
భారత్ వంటి దేశానికి రెండు రకాల జలాంతర్గాముల కలయిక ఆర్థికంగాను, మరింత అర్థవంతంగాను ఉంటుందని ఆ అధికారి తెలిపారు. సంప్రదాయ డీజిల్, విద్యుత్ జలాంతర్గాములను నిర్మించేందుకు సుమారు రూ.25,000 కోట్లు ఖర్చు అయితే, అణు జలాంతర్గాములను నిర్మించడం, నిర్వహించడానికి రెండింతల వ్యయం (రూ.50,000 కోట్లు) అవుతుందన్నారు.
అయితే ఖర్చు ఎక్కువైనప్పటికీ అణు జలాంతర్గాములు నావికా దళాలకు భారీ సామర్థ్యాన్ని అందిస్తాయని చెప్పారు. సంప్రదాయ సబ్మెరైన్లు బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి విధిగా క్రమమైన వ్యవధిలో ఉపరితలంపైకి రావాల్సిన అవసరం ఉండగా, అణు సబ్మెరైన్లకు ఇలాంటి అవసరం లేకుండా నెలల పాటు నీటి అడుగున ఉంటాయని వివరించారు.
భారత నావికాదళం 24 కొత్త జలాంతర్గాములను సమర్చుకునే ప్రణాళికతో ఉన్నదని ఆ అధికారి తెలిపారు. వాటిలో ఆరు కల్వరి తరగతికి చెందినవి కాగా, మరో ఆరు ప్రాజెక్ట్ 75 ఇండియా కింద నిర్మితమవుతాయని అన్నారు. దీని కోసం టెండర్ జారీ చేసినట్లు చెప్పారు. అలాగే ఆరు అణు జలాంతర్గాములను కూడా నిర్మించే ప్రతిపాదన క్యాబినెట్ భద్రతా కమిటీ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు.