Indian Navy | భారత నౌకాదళం గురువారం స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్‌ను విజయవంతంగా పరీక్షించింది. సముద్ర ఉపరితలంపై నుంచి దూసుకెళ్లే తక్కువ ఎత్తులో వెళ్లే వేగవంతమైన క్షిపణి అని.. ఐఎన్ఎస్ సూరత్ లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకుందని భారత నావికాదళం వెల్లడించింది. దాంతో భారత దేశ రక్షణా సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక భూమిక పోషిస్తుందని నేవీ పేర్కొంది. భారత నావికాదళం అరేబియా సముద్రంలో ఈ మిస్సైల్‌ను పరీక్షించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టెస్ట్ జరిగింది. ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న విషయం విధితమే.
ఐఎస్ఐ, పాక్ సైన్యం ఈ దాడికి తెగబడినట్లుగా నివేదికలు అందుతున్న నేపథ్యంలో ఈ మిస్సైల్ టెస్ట్ విజయవంతం కావడం పాకిస్తాన్‌కు ఓ వార్నింగ్లాంటిదని పలువురు పేర్కొంటున్నారు. అయితే, పాకిస్తాన్ కరాచీ తీర ప్రాంతం నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉపరితలం నుంచి ఉపరితలం వరకు మిస్సైల్ టెస్ట్‌లు నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలోనే తాజాగా భారత నేవీ స్వదేశీ గైడెడ్ మిస్సైల్‌ను పరీక్షించడం విశేషం. మిస్సైల్ టెస్ట్‌కు సంబంధించిన వీడియోను నేవీ షేర్ చేసింది. స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఐ సూరత్ సముద్ర స్కిమ్మింగ్ లక్ష్యాన్ని విజయవంతంగా నిర్వహించిందని.. ఇది మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరో మైలురాయిని సూచిస్తుందని నేవీ వివరించింది.