Indian Navy : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. దాంతో భారత్ సరిహద్దుల వెంట నిఘాను పటిష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేవీ సిబ్బంది సముద్రంలో గస్తీ కాస్తున్న ఘటనకు సంబంధించిన ఓ ఫొటోను భారత నౌకాదళం (Indian Navy) షేర్ చేసింది. ఆ ఫొటోలో ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH), స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి ఉన్నాయి.
ఆ ఫొటోకు ‘భారత నేవీ త్రిశూల శక్తి సముద్రంపైన, కింద, అలల మీదుగా’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది. అదేవిధంగా ‘Anytime Anywhere Anyhow’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. ధ్రువ్ హెలికాప్టర్ కార్యకలాపాలను కొన్ని నెలల క్రితం నిలిపేశారు. దీన్నిబట్టి చూస్తే ఆ ఫొటో పాతదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగినప్పటి నుంచి భారత సైన్యం తన శక్తి సామర్థ్యాలను చాటే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది.
కాగా పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి వెనక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఫ్రంట్ అనేది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నడ్డివిరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి.
ఇదిలావుంటే కొన్ని నెలల క్రితం నిలిపివేసిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, నౌకాదళంలో ఉన్న ఈ హెలికాప్టర్లకు మాత్రం అనుమతివ్వలేదని తెలిసింది. ఇక అత్యంత అధునాతనమైన స్కార్పీన్ తరగతి జలాంతర్గాములు భారత నౌకాదళంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇవి శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను వేటాడుతాయి. నిఘా సమాచారాన్ని సేకరిస్తాయి.
సాగరజలాల్లో మందుపాతరలు అమర్చడంలో తోడ్పడుతాయి. నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యర్థుల కదలికలపై కన్నేసి ఉంచుతాయి. ఫ్రాన్స్ తోడ్పాటుతో రూపొందించిన ఈ జలాంతర్గాములకు శత్రువుల నిఘా సాధనాలకు దొరకని రీతిలో అద్భుతమైన స్టెల్త్ లక్షణాలు ఉన్నాయి. టోర్పిడోలను, నౌకా విధ్వంసక క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ కోల్‌కతా ప్రధాన డెస్ట్రాయర్. ఇది భారత నౌకాదళానికి చెందిన శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటి అని చెప్పవచ్చు.