న్యూఢిల్లీ: నిజాయితీగా ఇచ్చిన ఒకే ఒక్క జవాబు.. అమెరికాను సందర్శించాలన్న అతని చిరకాల స్వప్నాన్ని ఛిద్రం చేసింది. అమెరికన్ ఎంబసీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ భారతీయ యువకుడు రెడిట్ పోస్టులో పంచుకున్నాడు. ఫ్లోరిడాలో పర్యటించడానికి టూరిస్టు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఆ యువకుడు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో ఇటీవల ఇంటర్వ్యూకు వెళ్లాడు.
తనను మూడే ప్రశ్నలు అడిగారని, 40 సెకండ్లలో తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పుకొచ్చాడు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అతను తెలిపాడు. ఇంటర్వ్యూ చేసే అధికారి తనను ‘అమెరికాలో నీకు బంధువులు లేక స్నేహితులు ఉన్నారా?’ అని అడిగాడని, అందుకు తాను ఎంతో నిజాయితీగా, ‘ఫ్లోరిడాలో నా గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది.
ఆమెను కలవాలని అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చానని ఆ యువకుడు వెల్లడించాడు. ఎంబసీ అధికారి మరో ప్రశ్న అడగకుండా తన చేతిలో 214(బీ) స్లిప్పు(తిరస్కరణ) పెట్టాడని, 40 సెకండ్లలో తన ఆశలు అడియాసలయ్యాయని అతను వాపోయాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన లభించింది.