న్యూఢిల్లీ : జేపీ మోర్గాన్ చేస్ బ్యాంక్‌లో పనిచేసే ఓ సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేసిందని అదే కంపెనీకి చెందిన భారత సంతతి పురుష ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై న్యూయార్క్ కౌంటీ సుప్రీం కోర్ట్‌లో అతడు కేసు వేశాడు. డైలీ మెయిల్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఫిర్యాదిదారు జాన్‌పై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోర్నా హజ్దిని (37) పలుమార్లు జాతి వివక్ష వ్యాఖ్యలకు, లైంగిక వేధింపులకు, దాడులకు పాల్పడ్డారు. 2024 వసంత కాలం నుంచి ఈ వేధింపులు ప్రారంభమయ్యాయి. వార్తా పత్రికల్లో రాయడానికి వీల్లేని అసభ్యకర భాషలో లోర్నా తన లైంగిక కోరికలు తీర్చమని తనను వేధించేదని ఫిర్యాదిదారు ఆరోపించారు. తన కోరికలు తీర్చకపోతే ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటానని బెదిరించేదని వాపోయాడు.
ఇలా బెదిరించి రెండు, మూడుసార్లు అతడిపై ఆమె లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఉంది. ఫిర్యాదిదారును ఆమె ‘లిటిల్ బ్రౌన్ బాయ్’ గా హేళన చేసేది. అతడితో లైంగిక సంబంధం పెట్టుకోవడం కోసం మత్తు మం దు, అంగ స్తంభన పెంచే మందులను ఇచ్చేది. జాన్ ఆరోపణలను ధ్రువీకరించేందుకు ఇద్దరు సాక్షులున్నట్టు డైలీ మెయిల్ పేర్కొంది. లైంగిక వేధింపులపై నిరుడు మేలో జాన్ కంపెనీ యజమాన్యానికి ఫిర్యాదు చేశాక అతడికి బెదిరింపులు వచ్చాయి. జాన్ ఆరోపణలను జేపీ మోర్గాన్ చేస్ బ్యాంక్ ఖండించింది. ఈ విషయమై అంతర్గత విచారణ జరిపామని.. అతడి ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొన్నది.