న్యూఢిల్లీ : ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభంలో భారత వాయు సేన కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఇండోనేషియాలోని ఇండియన్ డిఫెన్స్ అటాషే, కెప్టెన్ (ఇండియన్ నేవీ) శివ్ కుమార్ చెప్పారు. దీనికి కారణం భారత దేశ రాజకీయ నాయకత్వం విధించిన ఆంక్షలేనని తెలిపారు. పాకిస్థానీ సైనిక స్థావరాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడి చేయవద్దని ఆంక్షలు విధించారని వివరించారు. “పాకిస్థాన్-ఇండియా గగనతల యుద్ధంపై విశ్లేషణ, గగనతల సామర్థ్యం దృష్ట్యా ఇండోనేషియా ముందస్తు వ్యూహాలు” అనే అంశంపై ఇండోనేషియాలో ఈ నెల 10న జరిగిన సెమినార్లో కెప్టెన్ శివ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మే 7న రాత్రి ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. ఈ సెమినార్లో తన కన్నా ముందు మాట్లాడిన వక్త భారత్ అనేక యుద్ధ విమానాలను కోల్పోయిందని చెప్పారని, దానితో తాను ఏకీభవించడం లేదని తెలిపారు. అయితే, కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు అంగీకరిస్తానని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’లో ఆరు భారతీయ యుద్ధ విమానాలను కూల్చేసినట్లు పాకిస్థాన్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. వీటిలో రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని చెప్తున్నది. అయితే, భారత అధికారులు మాత్రం కొన్ని విమానాలను కోల్పోయామని మాత్రమే చెప్తున్నారు. నిర్దిష్టంగా సంఖ్యను చెప్పడం లేదు.
కెప్టెన్ శివ్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. దేశాన్ని కేంద్రం తప్పుదోవ పట్టించిందని విమర్శించింది. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధాని ఎందుకు తిరస్కరిస్తున్నారని నిలదీసింది.పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించింది. ఇదిలావుండగా, ఇండోనేషియాలోని ఇండియన్ ఎంబసీ ఆదివారం ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, కెప్టెన్ శివ్ కుమార్ ప్రజంటేషన్ ఉద్దేశం, వ్యక్తీకరణలను మీడియా కథనాలు వక్రీకరించాయని తెలిపింది.