Operation Sindoor | న్యూఢిల్లీ, మే 12: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన దాడులు, అనంతరం కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సోమవారం త్రివిధ దళాల డీజీఎంవోలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిందూర్ ఆపరేషన్ గురించి వారు మీడియాకు వివరించారు. ‘ఉగ్రవాదులతోనే మా పోరాటం, ఉగ్రవాదులు, వారికి సహాయం చేసే వారికి బుద్ధి చెప్పడానికే ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. కానీ పాకిస్థాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తున్నది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నది. ప్రస్తుతం పాకిస్థాన్ ఎదుర్కొంటున్న పరిణామాలకు ఆ దేశమే పూర్తి బాద్యత వహించాలి’ అని ఎయిర్ మార్షల్ ఏకే భార్తి స్పష్టం చేశారు. ‘మా పోరాటం ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాల పైనే. అయితే ఉగ్రవాదుల కోసం పాకిస్థాన్ మిలిటరీ జోక్యం చేసుకోవడం నిజంగా జాలిగొలిపే విషయం. అందుకే దానిపై స్పందించాలని మేం నిర్ణయించుకున్నాం’ అని ఆయన అన్నారు.
పాక్ దాడులను సమర్ధంగా తిప్పికొట్టాం
అంబ్రెల్లా ఆపరేషన్ కింద ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా వైమానిక, ఇతర దళాల సమన్వయంతో సరిహద్దు వెంబడి ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఏకే భార్తి తెలిపారు. ‘ఈ యుద్ధంలో పాక్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది. దేశీయంగా తయారు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా వాటిని సమర్థంగా అడ్డుకున్నాం. చైనాలో తయారు చేసిన పీ-15 క్షిపణులతో పాక్ దాడి చేసింది. వాటిని ఆకాశ్ క్షిపణులతో అడ్డుకుని కూల్చేశాం. పాకిస్థాన్‌లోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేసి పూర్తిగా దానిని ధ్వంసం చేసింది. మన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులు చేసినా దానిని అడ్డుకోవడంతో పాకిస్థాన్ నిస్సహాయంగా ఉండి పోయింది’ అని వివరించారు. భారత్ చేసిన దాడుల్లో దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ వైమానిక రక్షణ వ్యవస్థ అద్భుతమైన పనితీరును కనబర్చిందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళం వివిధ లక్ష్యాలను ఛేదించిన దృశ్యాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. అలాగే పాకిస్థాన్ వినియోగించిన అంతరిక్షం నుంచి అంతరిక్షానికి ప్రయోగించే పీఎల్-15 క్షిపణి ధ్వంసం అనంతరం పడ్డ శకలాలను కూడా వారు చూపించారు.
కోహ్లీ రిటైర్మెంట్ గురించి ప్రస్తావన
డీజీఎంఓ లెఫ్ట్‌నెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ ‘మన వైమానిక క్షేత్రాలు, లాజిస్టిక్‌లను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టం, మీరు అన్ని పొరలను దాటి వచ్చినప్పటికీ ఈ గ్రిడ్ వ్యవస్థ యొక్క పొర మిమ్మల్ని తాకుతుందని’ హెచ్చరించారు. భారత్ ఇప్పటిక శాంతికి కట్టుబడి ఉందని, అయితే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే దాడికి ఏమాత్రం వెనుకాడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారు. మన ఎయిర్ డిఫెన్స్ సామర్ధ్యాన్ని నాటి ఆస్ట్రేలియా క్రికెట్ బౌలర్లు లిల్లీ, థాంప్సన్లతో పోల్చారు.