ముంబై: భారతదేశానికి చెందిన ఓ దంపతులు సింగపూర్ నుంచి ముంబైకి అక్రమంగా బంగారం తీసుకొచ్చి, అక్కడి నుంచి ఆ బంగారాన్ని చెన్నైకి తరలించేందుకు ప్లాన్ చేశారు. అయితే ముంబై కస్టమ్స్ అధికారుల తనిఖీతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు ముంబై పోలీసులకు అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులిద్దరినీ కటకటాల వెనక్కి పంపారు.
వివరాల్లోకి వెళ్తే.. భారత్కు చెందిన ఓ జంట రూ.1.05 కోట్ల విలువైన రెండు కిలోల బరువున్న 24 క్యారట్ బంగారం పొడితో ఇండిగో విమానంలో సింగపూర్ నుంచి ముంబై ఎయిర్పోర్టుకు వచ్చింది. ఈ రెండు కిలోల బంగారాన్ని దంపతులిద్దరీ లోదుస్తుల్లో కొంత, వారి మూడేళ్ల పాప డైపర్లో కొంత దాచుకుని వచ్చారు. అక్కడి నుంచి నేరుగా చైన్నైకి ఆ బంగారం పొడిని తరలించాలనేది ఆ నిందితుల ప్లాన్.
అయితే, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ముంబై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి, వారి పసిబిడ్డ నుంచి బంగారం పొడిని సీజ్ చేశారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి ముంబై పోలీసులకు అప్పగించారు.