Coast Guard : సముద్రం నడుమగల దీవిలో ఓ వ్యక్తికి గుండెపోటు (Heart attack) రాగా.. సకాలంలో స్పందించిన భారత తీర రక్షక దళం (Indian Coastguard) అతడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. లక్షద్వీప్ (Lakshadweep) లోని అగాట్టీ ద్వీపంలో ఓ 55 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దాంతో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఎస్‌వోఎస్.. భారత కోస్ట్‌గార్డ్‌కు సమాచారం ఇచ్చింది.
వెంటనే స్పందించిన భారత తీర రక్షకదళం అతడిని హుటాహుటిన కొచ్చికి తరలించింది. బాధితుడిని అగాట్టీ ద్వీపం నుంచి తరలిస్తున్న సమయంలో విమానంలోని మొబైల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (MICU) లో వైద్య బృందం ప్రథమ చికిత్స అందించింది. అనంతరం అతడిని కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉన్నదని, చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. లక్షద్వీప్‌లో మెడికల్ ఎమర్జెన్సీ సంభవించినప్పుడు వెంటనే స్పందించేందుకు వీలుగా భారత తీర రక్షకదళం మెడికల్ ఎవాక్యుయేషన్ (MEDEVAC) లాంటి ఆపరేషన్లను చేపడుతుందని చెప్పారు. ఈ నెలలో ఇద్దరు వ్యక్తులను వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ చేసిందని తెలిపారు.