న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సరికొత్త వ్యూహాన్ని అమలుజేస్తున్నదని మనదేశ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్వోసీ వెంబడి ఇటీవలి కాలంలో జరుగుతున్న ఉగ్రదాడులే ఇందుకు నిదర్శనమని భారత భద్రతా అధికారులు చెబుతున్నారు. ఎల్వోసీ వెంబడి పాక్కు చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోల కదలికలు పెరిగాయని, మనదేశ సైనికుల్ని టార్గెట్ చేస్తూ..మందుపాతర్లను పాతిపెట్టడం, స్థానిక ఉగ్రవాదుల్ని తిరిగి బలోపేతం చేయటం..వంటి చర్యలకు పాక్ పాల్పడుతున్నదని నిఘా వర్గాలు తెలిపాయి. మనదేశ భద్రతా దళాల్ని దెబ్బతీసేందుకు మందుపాతర్లని అమర్చడానికి పాక్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నదని, కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను తిరిగి క్రీయాశీలం చేయాలన్నది పాక్ వ్యూహంగా ఉందని భద్రతా అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.