Monkey pox | ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక మంకీ పాక్స్ వైరస్ పట్ల కేంద్రం అప్రమత్తమైంది. సౌదీ అరేబియా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వచ్చిన వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. స్వీడన్, ఫిలిప్పీన్స్ లోనూ వైరస్ లక్షణాలను నిర్ధారించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, లాండ్ పోర్టుల అధికారులు.. మంకీ పాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయమై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ అలర్ట్ జారీ చేసినట్లు తెలిసింది.
మంకీ పాక్స్ వ్యాధిని ఎదుర్కోవడానికి ఢిల్లీలోని మూడు కేంద్ర ప్రభుత్వ దవాఖానలను నోడల్ కేంద్రాలుగా కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. రామ్ మనోహర్ లోహియా దవాఖాన, సప్ధర్ జంగ్ దవాఖాన, లేడీ హార్డింగ్ దవాఖానల్లో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, చికిత్సకు ఏర్పాట్లు చేయనున్నది. నోడల్ కేంద్రాలు గుర్తించి మంకీ పాక్స్ వైరస్ ను గుర్తించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 నుంచి ఇప్పటి వరకూ 116 దేశాలకు విస్తరించిన మంకీ పాక్స్.. 99,176 మందికి సోకింది. ఇటీవల కాంగోలో వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 15,600 కేసులు నమోదు కాగా, 537 మంది రోగులు మరణించారు. 2022 నుంచి భారత్ లో 30 మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా, గత మార్చిలో చివరి కేసు గుర్తించామని కేంద్రం తెలిపింది.