భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో భారతీయ వైమానిక దళం(ఐఏఎప్) గురువారం సెంట్రల్ సెక్టార్ వ్యాప్తంగా ఆపరేషన్ ఆక్రమణ్ పేరిట భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించింది. రాఫెల్ జెట్ల సారథ్యంలో ఐఏఎఫ్ తన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని హషిమారాలో రెండు రాఫెల్ స్కాడ్రన్లను ఐఏఎఫ్ నిర్వహిస్తోంది.
అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రాఫెల్ యుద్ధ విమానాలు ప్రస్తుత వైమానిక విన్యాసాలలో కీలక భూమికను పోషిస్తున్నాయి. చదునుగా ఉన్న ప్రదేశాలు, పర్వత ప్రాంతాలతో సహా భిన్న భూ స్వరూపాలు కలిగిన ప్రదేశాలపై వైమానిక దాడులకు సంబంధించిన విన్యాసాలు ప్రస్తుతం జరుగుతున్నట్లు వారు చెప్పారు.
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఇటీవల ఉగ్ర దాడి జరిగిన దరిమిలా భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ ఐఏఎఫ్ ఆపరేషన్ ఆక్రమణ్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విన్యాసాలలో ‘టాప్ గన్స్’ పాల్గొంటున్నాయని, హై క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్లర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న వీటిని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయం అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తోందని ఐఏఎఫ్ పైలట్లు వెల్లడించారు.