న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సైనిక దాడుల్లో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మే 7న 9 ఉగ్రవాద స్థావరాల ధ్వంసంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతున్న పాకిస్థాన్‌కు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు కీలక ప్లాన్ అమలు చేసింది. మే 10న తెల్లవారుజామున 2 గంటల సమయంలో పాక్‌ను ఫూల్ చేసేందుకు మానవ రహిత డమ్మీ విమానాన్ని ఆ దేశ గగనతలంలోకి భారత్ పంపింది.
కాగా, భారత్ వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు పాకిస్థాన్ సైన్యం భ్రమపడింది. కీలకమైన12 ఎయిర్‌బేస్‌లో మోహరించిన రాడార్లు, చైనా తయారీ వైమానిక రక్షణ వ్యవస్థలైన హెచ్‌క్యూ-9 క్షిపణి వ్యవస్థలను పాక్ యాక్టివేట్ చేసింది. దీంతో వీటి ఉనికిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గుర్తించింది. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను జామ్ చేసింది. ఆ వెంటనే పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. లాంగ్ రేంజ్ క్షిపణులతో పాక్ ఎయిర్బేస్ల్లోని రాడార్లను ధ్వంసం చేసింది. కీలక వైమానిక స్థావరాలతో పాటు రన్వేలు, ఇతర మౌలిక సదుపాయాలను భారత్ నాశనం చేసింది.
మరోవైపు మే 10న తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన కీలక దాడుల్లో సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులతోపాటు స్కాల్ప్, రాంపేజ్, క్రిస్టల్ మేజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. దీంతో కీలకమైన 11 పాక్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఎయిర్‌స్ట్రిప్‌లు, హ్యాంగర్లు, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు, సింధ్‌లోని వైమానిక ముందస్తు హెచ్చరిక విమానం, అక్కడ మోహరించిన లాంగ్ రేంజ్ డ్రోన్లు నాశనమయ్యాయి.
కాగా, భారత్‌పై దాడులకు కీలకమైన 11 ఎయిర్‌బేస్‌లకు భారీ నష్టం కలుగడంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ డీజీఎంవో అకస్మాత్తుగా సీజ్ ఫైర్ కోసం భారత్ డీజీఎంవోను అభ్యర్థించారు. భారత్ కూడా అంగీకరించడంతో మే 10 సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ను మలుపుతిప్పిన ఈ కీలక సైనిక పరిణామం గురించి భారత వైమానిక అధికారులు వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.