న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: వాస్తవాధీన రేఖ వద్ద వెనక్కి తగ్గాలని చైనాకు భారత్ డిమాండ్.. మీరే తగ్గాలని చైనా డిమాండ్.. ఎన్నోసార్లు ఉన్నతాధికారుల చర్చలు జరిగాయి.. 2020 ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. నెలలు, సంవత్సరాలు గడిచాయి. రెండు దేశాలూ.. తగ్గేదేలే! అన్నట్టు వ్యవహరించాయి. కానీ, ఉన్నట్టుండి మంగళవారం రెండు దేశాలు తూర్పు లఢక్‌లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్ పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి బలగాలను ఉపసంహరించాయి. వావ్.. మోదీ సర్కారు దౌత్యం ఎంత గొప్పది అని మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌లు. టెంట్లతో సహా బలగాలు వెనక్కి తగ్గాయని స్క్రోలింగ్‌లు. ఇన్ని రోజులుగా ఫలితమివ్వని చర్చలు ఒకే రోజులో ఎలా సెట్ అయ్యాయి? అంటే.. భారత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేయటం వల్లే! అవును.. బలగాల ఉపసంహరణ వెనకున్న ఈ అసలు నిజాన్ని లఢక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు చెందిన కౌన్సిలర్ కొంచక్ స్టాంజిన్ బయటపెట్టారు.
తూర్పు లఢక్‌లోని పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ, అక్కడి నుంచి మాత్రమే కాదు.. పెట్రోలింగ్ పాయింట్ 16 (పీపీ-16) నుంచి కూడా రెండు దేశాల బలగాలు వెనక్కి తగ్గాయని స్టాంజిన్ తెలిపారు. ‘పీపీ-16 పూర్తిగా భారత్‌కు చెందినదే. దశాబ్దాలుగా అక్కడ ఆర్మీ శాశ్వత సైనిక పోస్ట్‌ను నిర్వహిస్తున్నది. దాని సమీపంలోని క్రుగ్యాంగ్ లోయలో స్థానిక ప్రజలు పశువులను మేపుకొనేవారు. కానీ ఇప్పుడు బఫర్ జోన్‌గా మారిపోయింది’ అని వివరించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎలాంటి పోరాటం చేయకుండానే ఇచ్చేసిన ఆ భూభాగంలో తిరిగి ఎలా, ఎంత స్వాధీనం చేసుకొంటారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2020 ఏప్రిల్‌కు ముందు ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలన్న భారత డిమాండ్‌ను చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు.
వాస్తవాధీన రేఖ నుంచి భారత, చైనా బలగాలు ఆయుధ సంపత్తితో సహా వెనక్కి తగ్గాయని భారత మీడియాల్లో వచ్చిన వార్తలను చూసి చైనీయులు నవ్వుతున్నారు. వాస్తవం ఏంటంటే.. బలగాలు వెనక్కి తగ్గిన ప్రాంతం భారత్‌దే. అంటే.. భారత భూభాగం నుంచే చైనా వెనక్కి వెళ్లింది. భారత భూభాగం నుంచే భారత్ వెనక్కి వచ్చింది. .
– బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి