Diabetes | న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2022లో నమోదైన మొత్తం 82.8 కోట్ల మధుమేహం కేసుల్లో నాలుగో వంతుకు పైగా భారత్లో నమోదయ్యాయని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబొరేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన అధ్యయన నివేదిక ఇటీవల లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైంది.
14.1 కోట్ల వయోజనులను సర్వే చేసిన 1108 జనాభా ఆధారిత అధ్యయనాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం భారత్లో 62 శాతం డయాబెటిస్ రోగులు ఎలాంటి చికిత్సను పొందడం లేదు. భారత్ జనాభాలో సుమారు 23.7 శాతం(21.2 కోట్లు) మంది 2022లో డయాబెటిస్తో బాధ పడుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో భారత్తో సహా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో మధుమేహ రోగుల సంఖ్య వేగంగా పెరిగింది.