న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిని భారత్ ఆదివారం పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ప్రయోగించిన ఆర్మీ వ్యవస్థకు చెందిన ఈ క్షిపణి నేరుగా లక్ష్యాన్ని తాకి దానిని ధ్వంసం చేసిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ క్షిపణి పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. అత్యంత వేగంతో కూడిన దీర్ఘ శ్రేణి ఏరియల్ లక్ష్యాన్ని ఇది నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసిందని వివరించారు.
కాగా, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. తాజాగా ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్ క్షిపణిని ఆదివారం విజయవంతంగా పరీక్షించారు. అలాగే సుదూర లక్ష్యాలను ఛేదించే దీర్ఘ శ్రేణి బ్రహ్మోస్ వెర్షన్ను భారత నేవీ ఈ నెలలో పరీక్షించింది. ఇది లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా ధ్వంసం చేసిందని నేవీ అధికారులు పేర్కొన్నారు.