MEA | భారత్, కెనాలో మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. కెనడాలోని హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలు, అధికారులను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అక్కడి భారత దౌత్యవేత్తలు, అధికారుల భద్రతకు ప్రమాదం ఏర్పడిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఓ ప్రకటనలో పేర్కొంది. దాంతో కెనడా నుంచి హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని భారతదేశం నిర్ణయించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ న్యూఢిల్లీలోని కెనడా దౌత్యేవేత్తకు సమన్లు జారీ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం సరికాదని విదేశాంగశాఖ.. కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్కి స్పష్టం చేసింది. అయితే, ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మతో పాటు ఇతర దౌత్యవేత్తల పేర్లను అనుమానితులుగా చేర్చింది. కెనడా చర్యను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే భారత హైకమిషనర్‌తో పాటు దౌత్యవేత్తలను వెనక్కి పిలవాలని నిర్ణయించింది.
వాస్తవానికి, కెనడా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో అనుమానితులుగా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తల పేర్లను చేర్చింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇంతకుముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ కెనడా ఆరోపణలను హాస్యాస్పదని పేర్కొంది. తన రాజకీయ లబ్ధి కోసం ప్రధాని ట్రూడో ఉద్దేశపూర్వకంగా భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దౌత్యవేత్తలపై కల్పిత ఆరోపణలు చేసేందుకు కెనడా ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయత్నాలకు ప్రతిస్పందిస్తూ తగిన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే.. ఓ వ్యక్తి నేరంలో పాలుపంచుకున్నాడని పోలీసులు భావిస్తుంటారు. అయితే, అతనిపై అధికారికంగా అభియోగాలు మోపడం, అరెస్టు చేయడం మాత్రం సాధ్యం కాదు. అతని కార్యకలాపాలు, పరిచయాలు, ఇతర సమాచారం దర్యాప్తులోకి చేరుస్తారు. కెనడా ప్రధాని ట్రూడో సర్కారు ఇలా చేయడం కొత్తమీ కాదు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యల్లో ట్రూడో వార్తలో నిలిచారు.
విదేశాంగ శాఖతో సమావేశం అనంతరం దౌత్యవేత్త స్టీవర్ట్ విలేకరులతో మాట్లాడారు. కెనడియన్ పౌరుడి హత్యలో విశ్వసనీయమైన, తిరస్కరించలేని సాక్ష్యాలను అందించిందన్నారు. భారత్‌కు సహకరించేందుకు కెనడా సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలను విదేశాంగ సైతం ఖండించింది. కెనడాలోని భారత్ హైకమిషనర్, దౌత్యవేత్తలు, అధికారులపై లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుత కెనడా ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. దాంతో హైకమిషనర్, దౌత్యవేత్తలను, అధికారులను వెనక్కి పిలవాలని నిర్ణయించినట్లు పేర్కొంది.