న్యూఢిల్లీ, నవంబర్ 17 : దీర్ఘ శ్రేణి హైపర్‌సానిక్ క్షిపణి పరీక్షను భారత్ తొలిసారి ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. తద్వారా ఈ సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన నిలిచింది. గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని అత్యంత వేగంతో లక్ష్యాలను ఛేదించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ఒడిశా తీరప్రాంతంలో చేపట్టిన లాంగ్రేంజ్ ‘హైపర్‌సానిక్’ క్షిపణి టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ అయ్యిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ప్రకటించారు. మిస్సైల్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీవో సైంటిస్టులను అభినందించారు. ఈ విజయం అత్యంత క్లిష్టమైన, అధునాతన మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్‌ను నిలిపిందని అన్నారు. అణ్వాయుధాల్ని, శక్తివంతమైన బాంబుల్ని ఈ మిస్సైల్స్‌తో ప్రయోగిస్తారు. ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో రూపొందించారు. హైపర్‌సానిక్ క్షిపణులు ధ్వని వేగం (మ్యాక్ 5-గంటకు 1,220 కిలోమీటర్ల) కంటే ఐదు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. అంటే గంటకు 6,250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. కొన్ని అడ్వాన్స్డ్ క్షిపణులు గంటకు 24,140 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించగలవు. అంత మెరుపువేగంలో కూడా ఇవి శత్రు రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలకు దొరక్కండా దిశను మార్చుకోగలవు.