న్యూఢిల్లీ : రక్షణ రంగంలో భారత్ మరో విజయాన్ని సాధించింది. పినాక ఎంకే-1 (Enhanced) రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇవాళ పినాక ఎంకే-1 (మెరుగైన) రాకెట్ సిస్టమ్ (EPRS), పినాకా ఏరియా డినియల్ మ్యూనిషన్ (ADM) రాకెట్ వ్యవస్థలను డీఆర్డీఓ, భారత సైన్యం సంయుక్తంగా పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించిందని రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. పదిహేను రోజుల వ్యవధిలో మొత్తం 24 ఈపీఆర్‌ఎస్ రాకెట్లను వివిధ రేంజ్‌ల్లో ప్రయోగించారు.
శనివారం పాక్ సైతం ఉపరితల బాలిస్టిక్ క్షిపణి షహీన్-3 ప్రయోగించిన రోజు భారత్ సైతం పినాక ఎంకే-1 రాకెట్‌ను పరీక్షించింది. రాకెట్లు అన్ని ట్రయల్ లక్ష్యాలను సంతృప్తికరంగా చేరాయని, అవసరమైన కచ్చితత్వం, స్థిరత్వం సాధించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పినాక Mk-I మిస్సైల్ సిస్టమ్ రేంజ్ 45 కిలోమీటర్లు కాగా.. పినాక-II రాకెట్ రేంజ్ 60 కిలోమీటర్లు. పినాక రాకెట్ వ్యవస్థను పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేయగా.. దీనికి పూణేలోని డీఆర్డీఓ ప్రయోగశాల అయిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ సహకారం అందించింది.