ఢిల్లీ: ఇప్పటికే కామన్వెల్త్ క్రీడల (2030) హక్కులు దక్కగా, ఒలింపిక్స్ (2036) బిడ్నూ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్.. మరో ప్రతిష్టాత్మక క్రీడలకు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్నది. 2038 ఆసియా క్రీడలను నిర్వహించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ).. ఇటీవలే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈవోఐ)ను దాఖలు చేసింది.
ఈనెల 21న చైనాలోని సన్యాలో ఆసియా బీచ్ గేమ్స్ ప్రారంభం సందర్భంగా అక్కడ నిర్వహించిన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (వోసీఏ) సమావేశంలో ఈవోఐని సమర్పించింది. ఈ విషయాన్ని ఐవోఏ సీఈవో రఘురామ్ అయ్యర్ స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం ఈవోఐ మాత్రమే.. 2038 క్రీడల నిర్వహణకు సంబంధించిన వేదికను వోసీఏ 2028లో వెల్లడిస్తుంది.
భారత్ గనుక బిడ్ దక్కించుకుంటే దేశం మరో మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహణకు సిద్ధమవడం పక్కా! 2030లో రియాద్ (సౌదీ అరేబియా), 2034లో దోహా (ఖతార్) ఆసియా క్రీడలకు ఆతిథ్యమివ్వనున్నాయి. 1951లో అరంగేట్ర ఆసియా క్రీడలు భారత్లోనే నిర్వహించగా 1982లో రెండోసారి దేశం ఆతిథ్యమిచ్చింది. సుమారు 45 దేశాలు పోటీపడే ఈ క్రీడల్లో 40 క్రీడాంశాల్లో దాదాపు 11 వేలకు పైగానే అథ్లెట్లు పాల్గొంటారు.