న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో చేపట్టిన సైనిక దాడిలో పాకిస్థాన్‌కు భారత్ చుక్కలు చూపించింది. సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచిన ఆ దేశానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ధీటుగా బదులిచ్చింది. కరాచీ సమీపంలోని కీలకమైన సైనిక స్థావరం మాలిర్ కంటోన్మెంట్‌పై దాడి చేసింది. అక్కడున్న సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి స్థావరానికి నష్టం కలిగించింది.
కాగా, సోమవారం త్రివిధ దళాధికారుల మీడియా సమావేశం సందర్భంగా ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, ఎయిర్ మార్షల్ కేకే భారతి దీనిని ధృవీకరించారు. పాకిస్థాన్ డ్రోన్, యూఏవీ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ‘మా వైమానిక రక్షణ సంసిద్ధత సైనిక స్థావరాలకు లేదా పౌరులకు భూమిపై ఎలాంటి నష్టం జరుగకుండా చూసుకున్నది. అయితే, శత్రువు మరోసారి బలప్రదర్శనకు దిగాడు. పోరాటం కోరుకున్నాడు. దానికి మేం సిద్ధంగా ఉన్నాం. కచ్చితమైన ప్రతిస్పందనలో మరోసారి అతడి (పాకిస్థాన్) సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం. మాలిర్ కంటోన్మెంట్‌లోని ఎస్ఏఎం (సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి) స్థావరం కూడా ఇందులో ఉన్నది’ అని మీడియాకు వెల్లడించారు. భారత వైమానిక దాడుల్లో పాకిస్థాన్‌లోని సర్గోధా, రహీం యార్ ఖాన్, చక్లాలాలోని నూర్ ఖాన్, సుక్కూర్, భోలారి, జకోబాబాద్ వైమానిక స్థావరాలకు గణనీయంగా నష్టం జరిగిందని ఆధారాలతో సహా ఆయన వివరించారు.