Brahma Chellaney |హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఇండియాటుడేతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుందని ఊహించలేదన్నారు. ‘విజయం అంచుల వరకు వెళ్లి.. ఓటమిని ఒప్పుకోవడం భారత్‌కు అలవాటైంది’ అని వ్యాఖ్యానించారు.
శనివారం ఉదయం పాకిస్థాన్ సైన్యం సరిహద్దు వైపు కదిలిందని, భారత సైన్యం కూడా హై అలర్ట్‌లో ఉన్నదని, దీంతో యుద్ధం తథ్యం అనేస్థాయిలో వాతావరణం వేడెక్కిందన్నారు. కానీ అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు. ‘ప్రస్తుత పరిస్థితులు భారత్‌కు చాలా అనుకూలంగా ఉన్నాయి. పాకిస్థాన్ సైనిక శక్తి డొల్లతనం బయటపడింది. పాకిస్థాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించగా, భారత్ సమర్థవంతంగా అడ్డుకున్నది. ఇదే సమయంలో భారత సైన్యం పరిమిత సంఖ్యలో మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించి లక్ష్యాలను ఛేదించగలిగింది. దీంతో పాకిస్థాన్ వైమానిక దళం డొల్లతనం బయటపడింది. వారి సైనిక శక్తి గురించి ఇన్నాళ్లూ ప్రచారం చేసుకున్న దానికన్నా చాలా బలహీనంగా ఉన్నదని తేలిపోయింది’ అని పేర్కొన్నారు. ఇలా స్పష్టంగా భారత సైన్యం పై చేయి సాధిస్తున్న సమయంలో కాల్పుల విరమణకు మోదీ ప్రభుత్వం ఎందుకు ఒప్పకున్నదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘విజయం అంచున ఉన్నప్పుడు వెనక్కి తగ్గే సుదీర్ఘ భారత రాజకీయ ప్రస్థానానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. విజయం వాకిలి వరకు వెళ్లి తిరిగి రావడం అలవాటుగా మారిపోయింది’ అని విమర్శించారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడంలో భారత్ విఫలమైందని, గతంలో చేసిన వ్యూహాత్మక తప్పిదాలనే మళ్లీ చేస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోలేదు కాబట్టే.. అదే పునరావృతం అవుతున్నది’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు పలు ఉదాహరణలను పేర్కొన్నారు. ‘1972లో పాకిస్థాన్ నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండానే చర్చలు ముగించాం. 2021లో ఎలాంటి బేరసారాలు చేయకుండానే వ్యూహాత్మకంగా కీలకమైన కైలాశ్ పర్వతాలను ఖాళీ చేశాం. లద్దాఖ్‌లో చైనా నిర్దేశించిన బఫర్ జోన్లకు అంగీకరించాం. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం’ అని ఉదహరించారు.
పహల్గాం దాడిలో 26 మంది భర్తల మరణాలకు ప్రతీకారంగా ‘సిందూర్’ అనే గంభీరమైన పేరుతో ఆపరేషన్ చేపట్టారని గుర్తుచేశారు. పాకిస్థాన్ నుంచి కాల్పులు జరిపినా, మిస్సైళ్లు ప్రయోగించినా పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ‘ఈ రోజు తీసుకున్న నిర్ణయంపై చరిత్ర కనికరం చూపదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మొత్తంగా ఆపరేషన్ సిందూర్‌కు ఇలా ముగింపు ఇవ్వడం వ్యూహాత్మక తప్పిదంగా మిగిలిపోతుందని, ఇది సమాధానాల కన్నా ప్రశ్నలనే ఎక్కువగా మిగిల్చిందన్నారు.