వాషింగ్టన్: భారతీయ బియ్యం దిగుమతులపై అధిక టారిఫ్‌ను వసూల్ చేసేందుకు అమెరికా సర్కారు సిద్దమైంది. వ్యవసాయ దిగుమతులపై కొత్త పన్ను విధానాన్ని అమలు చేయనున్నట్లు ట్రంప్(Donald Trump) వెల్లడించారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంతో పాటు కెనడా నుంచి దిగుమతి అవుతున్న ఫెర్టిలైజర్లపై కొత్త సుంకాలు విధించనున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా రైతుల కోసం ట్రంప్ సర్కారు భారీ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో రైతు పెద్దలతో ట్రంప్ మాట్లాడారు. ఆ సమయంలో భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు అనేక ఆసియా దేశాలు అమెరికాకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. వ్యవసాయ దిగుమతుల వల్ల స్వదేశీ ఉత్పత్తిదారులకు సమస్యలు వస్తున్నట్లు రిపబ్లికన్ నేత చెప్పారు. అయితే ఆ సమస్యను పరిష్కరించేందుకు టారిఫ్ విధానాన్ని దూకుడుగా అమలు చేయనున్నట్లు చెప్పారు. వాణిజ్య పన్నుల ద్వారా సేకరించిన సుమారు 12 బిలియన్ల డాలర్ల నిధుల్ని అమెరికా రైతు సంక్షేమం కోసం ఖర్చు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్, వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ పాల్గొన్నారు.
బియ్యం ఉత్పత్తిలో ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. 150 బిలియన్ టన్నులు ఉత్పత్తి జరుగుతున్నది. గ్లోబల్ మార్కెట్లో ఇండియా షేర్ 28 శాతంగా ఉంది. బియ్యం ఎగుమతిలోనూ ఇండియా అగ్రస్థానంలో ఉంది. 2024-25 సీజన్లో గ్లోబల్ ఎగుమతుల్లో ఇండియా 30.3 శాతం ఉంది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 2.34 లక్షల టన్నుల బియ్యం అమెరికాకు సరఫరా చేశారు. భారతీయ రైస్‌ను దిగుమతి చేసుకుంటున్న వాటిలో పశ్చిమాసియా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. బియ్యంలో సోనా మసూరి రకానికి అమెరికా, ఆస్ట్రేలియాలో ఫుల్ డిమాండ్ ఉన్నది. భారతీయ ఉత్పత్తులపై ఇప్పటికే ట్రంప్ సర్కారు 50 శాతం సుంకాలు విధిస్తున్నది. ఇక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25 శాతం టారిఫ్‌ను ట్రంప్ విధించిన విషయం తెలిసిందే.