Abhijit Banerjee | న్యూఢిల్లీ, ఆగస్టు 10: అమెరికా సుంకాల పెంపు వల్ల జరుగుతున్న నష్టం కంటే రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురు దిగుమతులే మనకు విలువైనవా? అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ ప్రశ్నించారు. దీనిపై మన దేశం పునఃపరిశీలన చేయాలని ఆయన సూచించారు. భారత వస్తువులపై సుంకాలను అదనంగా 25% పెంచుతున్నామని, దీంతో ఈ నెల 27 నుంచి 50% సుంకాలు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ప్రకటించిన నేపథ్యంలో అభిజిత్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘రష్యన్ చమురు దిగుమతులు విలువైనవా కాదా? అనే దానిపై మనం తీవ్రంగా ఆలోచించాలి. ఆ తర్వాత రష్యా నుంచి మనం చమురు దిగుమతులను నిలిపివేస్తే సుంకాలను తొలగిస్తారా? అని అమెరికాను ప్రశ్నించాలి’ అని సూచించారు. అధిక సుంకాల వల్ల భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతుల్లో మినహాయింపు లేని 27 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించడంపై విధాన వర్గాల్లో ఇప్పటికే చర్చ జరుగుతున్నది.
ఇప్పటికే మన ఎగుమతుల్లో కొన్ని 25% సుంకం వద్ద పోటీపడటం లేదని, కనుక 50% సుంకం పెద్ద విషయమేమీ కాకపోవచ్చని అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. చైనాతో ఉన్న విస్తృత వాణిజ్య సమస్యలను ప్రస్తుతం ఆ దేశంతో కొనసాగుతున్న చర్చలకు అనుసంధానించాలని, అందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్నానని తెలిపారు. ‘ఆసియాన్’ వాణిజ్య కూటమిలో భారత్ చేరాలా? వద్దా? అని ప్రశ్నించగా.. ఆ కూటమిలో చేరాల్సిన అవసరం మన దేశానికి ఉన్నదని, కానీ.. ‘ఆసియాన్’ కంటే చైనా చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నానని స్పష్టం చేశారు.