న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై కాషాయ పార్టీల నేతల వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) భగ్గుమంది. భారత్‌పై తగు చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని కోరింది.ఇక ఓఐసీ ప్రకటనను భారత్ తోసిపుచ్చుతూ అన్ని మతాల పట్ల భారత్‌కు అత్యంత గౌరవం ఉందని పేర్కొంది. ఇస్లామిక్ దేశాల సమాఖ్య వ్యాఖ్యలు సంకుచిత ధోరణితో ఉన్నాయని పేర్కొంది.
కాగా, మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. మహ్మద్ ప్రవక్తపై భారత్ బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. మోదీ నేతృత్వంలో బారత్‌లో మత స్వేఛ్ఛను అణిచివేయడం, ముస్లింలను వేధించడం పదేపదే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమావేశం భారత్‌లో పరిణామాలను పరిశీలించి మందలించాలని అన్నారు.
మహ్మద్ ప్రవక్త పట్ల తమకున్న ప్రేమ అపారమని అన్నారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ప్రతినిధి చేసిన విద్వేషపూరిత దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భారత్‌లో ముస్లింల పట్ల మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వైఖరితో ముందుకెళుతోందని, ముస్లింలపై హింసాకాండను ప్రేరేపిస్తోందని పాక్ ప్రధాని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతల వివాదాస్పద ప్రకటనలను ఖతార్, కువైట్‌లు తీవ్రంగా ఖండించాయి. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పార్టీ ప్రతినిధి నూపుర్ శర్మ, మరో నేత నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.