Covid Cases in Maharastra | దేశమంతా మళ్లీ కరోనా తిరగబెడుతున్నది. గత మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా రెట్టింపు కేసులు నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 4,041 మందికి కరోనా సోకినట్లు తేలింది. మార్చి 11 తర్వాత ఇదే అత్యధికం. దాదాపు కరోనా ఆంక్షలన్నీ ఎత్తేయడంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త వేరియంట్లతో మరో వేవ్ బలోపేతం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసులు పెరుగుతున్న ఐదు రాష్ట్రాలకు కరోనా ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది.
తొలి నుంచి కరోనాకు హాట్‌స్పాట్‌గా ఉన్న మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నది. ఈ వారంలో పాజిటివిటీ రేట్ 8 శాతం పెరిగింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో 231 శాతం కొత్త కొవిడ్-19 కేసులు పెరిగాయి. మే నెలలో కేవలం 215 కేసులు మాత్రమే నమోదైన ముంబైలో ఎక్కువ మంది మహమ్మారి భారీన పడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనాను కట్టడి చేయడానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని కఠినంగా పర్యవేక్షిస్తూ.. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది.