Russia-Ukraine : అంతులేకుండా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు, రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈ విషయంలో భారత్ ఎలాంటి సాయమైనా చేస్తుందని వెల్లడించారు. కేంద్ర మంత్రి జైశంకర్ ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అండ్రీ సిబిహాతో జైశంకర్ గురువారం చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జైశంకర్ అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో, శాంతి స్తాపనలో ఏ రకమైన సహాయం చేయడానికైనా ఇండియా సిద్ధంగా ఉంది. అయితే, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది రెండు దేశాలే. ఈ విషయంపై ఉక్రెయిన్ మంత్రితో జరిగిన చర్చల్లో ఇదే ప్రధానమైన అంశం. యుద్ధం కొనసాగేకొద్దీ ప్రతి రోజూ ప్రాణాలు పోతూనే ఉంటాయి. విధ్వంసం జరుగుతూనే ఉంటుంది. అంతులేకుండా సాగుతున్న యుద్ధానికి ముగింపు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఎస్సీవో సదస్సులో చెప్పారు. ద్వైపాక్షిక చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే యుద్ధానికి ముగింపు లభిస్తుంది’’ అని జై శంకర్ వివరించారు.
అంతేకాదు.. నల్ల సముద్రంలో ఇటీవల వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా భారతీయులన్న నౌకలపై దాడులు జరుగుతున్న విషయాన్ని ఉక్రెయిన్ మంత్రికి వివరించారు. జై శంకర్ ప్రస్తుతం ఉక్రెయిన్ పర్యటనలో ఉండగా.. ఆ తర్వాత పోలాండ్‌లో కూడా పర్యటించనున్నారు. ఈ నెల 5 వరకు ఈ పర్యటన సాగుతుంది.