న్యూఢిల్లీ: అణ్వాయుధ విధానంలో కీలక మార్పును సూచిస్తూ భారత్ తొలిసారిగా 12 అణు బాంబులను(వార్హెడ్లు) మోహరించింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రీ) తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరు నిల్వల్లో ఉంచే దశాబ్దాల భారత్ విధానం నుండి భారీ మార్పును ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధాల పర్యవేక్షణ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. భారతదేశ ఆయుధ సంపత్తిని కేవలం నిల్వ ఉంచినట్లుగా కాకుండా కార్యకలాపాల కోసం మోహరించినట్లుగా వర్గీకరించడం ఇదే మొదటిసారని నివేదిక పేర్కొన్నది.
భూగర్భ క్షిపణి స్థావరాలు, కొత్త అణు జలాంతర్గాముల్లో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అణ్వాయుధాలను మోహరించడం పెరిగిన సంసిద్ధతకు సంకేతమని నివేదిక తెలిపింది. కొత్తగా మోహరించిన ఈ 12 అణుబాంబులు, వాటి ప్రయోగ వ్యవస్థలతో అనుసంధానించడం లేదా వాటిని కార్యాచరణ దళాలు ఉన్న స్థావరాల్లో ఉంచడం భారతదేశానికి ఇదే మొదటిసారని నివేదిక వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి(ఎస్ఎస్బీఎన్)పై తక్కువ సంఖ్యలో వార్హెడ్లను మోహరించడం, శత్రువుల దాడిని నిరోధించడానికి గస్తీ నిర్వహించడంతోపాటు గత ఏడాది కాలంలో భారతదేశ అణు ఆయుధాల నిల్వలో స్వల్ప పెరుగుదల నమోదైందని సిప్రీ నివేదిక పేర్కొన్నది.