న్యూఢిల్లీ, జూలై 12 : కేంద్రంలోని మోదీ సర్కార్ భారత రక్షణ ఉత్పత్తుల విధానంలో కీలక మార్పులు చేయబోతున్నది! క్షిపణుల తయారీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘అస్ర్తా మార్క్-2’ క్షిపణి తయారీ కోసం ప్రైవేట్ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించే అవకాశముందని, దీనికి ఇండోనేషియా ఆసక్తి కనబర్చినట్టు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఐకామ్, అదానీ, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ నుంచి బిడ్లు దాఖలయ్యే అవకాశముందని తెలిసింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఫిరంగి, నౌకాదళ ఫ్లాట్ఫామ్ వంటి రంగాల్లో భారత్ ఇప్పటికే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించింది. క్షిపణుల రంగాన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించటం ద్వారా, అస్ర్తా మార్క్-2 మొదటి ప్రైవేట్ తయారీ క్షిపణి అవుతుందని వార్తా కథనాలు వెలువడ్డాయి.