న్యూఢిల్లీ: యూఏఈకి నాన్ బాస్మతి రకం తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దేశంలో నాన్ బాస్మతి తెల్ల బియ్యం కొరతను నివారించేందుకు, ఆ బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం గత జూలైలో వాటి ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే, యూఏఈలో తెల్ల బియ్యం కొరత నేపథ్యంలో ఆ దేశానికి 75 వేల టన్నుల నాన్ బాస్మతి రకం తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం సమ్మతించింది.
అయితే, నేషనల్ కోపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ సోమవారం సాయంత్రం కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. సవరించిన ఎగుమతుల విధానం ప్రకారం.. ఇతర దేశాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అంగీకరించిన దేశాలకు మాత్రమే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బియ్యం ఎగుమతులను అనుమతిస్తున్నది.
సింగపూర్‌లో ఆహార భద్రత అవసరాల కోసం భారత్ గత నెలలో ఆ దేశానికి బియ్యం ఎగుమతులకు అనుమతించింది. కాగా, పశ్చిమ ఆఫ్రికా దేశమైన బెనెన్.. భారత్ నుంచి నాన్ బాస్మతి రైస్‌ను దిగుమతి చేసుకునే ప్రధాన దిగుమతి దారుగా ఉన్నది. బెనెన్తోపాటు యూఏఈ, నేపాల్, బంగ్లాదేశ్, చైనా, ఐవోరి, టోగో, సెనెగల్, గినియా, వియత్నాం, జిబౌటీ, మడగాస్కర్, కామెరూన్, సోమాలియా, మలేషియా, లైబీరియా దేశాలు కూడా భారత్ నుంచి నాన్ బాస్మతి రకం తెల్ల బియ్యాన్ని అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి.