Monsoon | న్యూఢిల్లీ, మే 16 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా భారత్‌ను పలుకరించనున్నాయి. జూన్ 4న ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం 83.5 సెం.మీ దాకా నమోదు కావొచ్చని తెలిపింది. ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేశమంతటా సాధారణ వర్షపాతం ఆశించవచ్చని చెప్పింది. సాధారణంగా ఏటా జూన్ 1న ఈ రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే గత అయిదేండ్లలో కేవలం నిరుడు మాత్రమే ఇలా జరిగింది. వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతు పవనాలు దేశంలో అత్యధిక భాగంలో వర్షాలకు కారణమవుతాయి.
సాధారణ వర్షపాతం నమోదు
2023 నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ప్రతికూల పర్యావరణం వల్ల ఎల్‌నినో ఏర్పడే అవకాశమున్నదని తెలిపింది. సీజన్ ద్వితీయార్థంలో దీని ప్రభావం కనిపించవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత వాతావరణ శాఖ ఈ వివరాలు తెలియజేసింది. భారత్‌లోని వాయవ్య, పశ్చిమ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. తూర్పు భారతదేశం, ఈశాన్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది.
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 67 శాతం ఉన్నదని ఐఎండీ వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర వెల్లడించారు. భారత్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవానాల కాలంగా పరిగణిస్తారు. భారత్‌లో ఈ ఏడాది లోటువర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఏప్రిల్ 10న ప్రకటించింది. కరువు ఏర్పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇందుకు కాస్త భిన్నంగా ఈ సారి వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ తెలిపింది.
ఐఎండీ అంచనాలతో ఉపశమనం
ఉత్తరార్ధగోళంలో యురేషియాపై హిమపాతం ఉండే ప్రాంతం డిసెంబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు సాధారణం కంటే తక్కువగా ఉన్నదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర పేర్కొన్నారు. ఇది భారత్‌లో నైరు తి రుతుపవనాల వర్షపాతానికి అనుకూలమైనదిగా పరిగణించవచ్చని వివరించారు. రుతుపవనాల వర్షాలపై ఆధారపడి ఎక్కువగా వ్యవసాయం చేసే భారత్‌కు ఐఎండీ అంచనాలు కాస్త ఉపశమనం కలిగించాయి. భారత గణాంకాల ప్రకారం దేశంలో 2019 రుతుపవనాల సీజన్లో 971.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2020లో వర్షపాతం 961.4 మిల్లీమీటర్లుగా ఉన్నది. 2021లో 874.5 మిల్లీమీటర్లు, 2022లో 924.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్టు ఐఎండీ వెల్లడించింది.