IMD | న్యూఢిల్లీ, జనవరి 13(నమస్తే తెలంగాణ): భారతీయులకు చిర కాలంగా వాతావరణ వార్తలు తెలియజేస్తూ, ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది. రైతులకు, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ విభాగం ఈ నెల 15న 149 ఏండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని 150 ఏండ్లలోకి అడుగు పెడుతున్నది.
1875 జనవరి 15న చిన్న సంస్థగా ప్రారంభమైన ఐఎండీ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఒక విశాల వృక్షంలా మారింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని వాతావరణ పరిస్థితులను కచ్చితత్వంతో అంచనా వేయడంలో ప్రపంచంలోనే మూడో అత్యున్నత వాతావరణ విభాగంగా గుర్తింపు పొందింది. ఐఎండీ అందిస్తున్న సేవలు, సమాచారం వల్ల మన దేశంలో విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గుతున్నది.
దేశంలో 1864లో సంభవించిన తీవ్రమైన తుఫాను, 1866, 1871లో తీవ్రమైన విపత్తులు సంభవించాయి. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను ముందుగా అంచనా వేయడం ద్వారా ఆస్తి, ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు నాడు భారత్‌లోని బ్రిటీష్ ప్రభుత్వం ఐఎండీని స్థాపించింది. నాడు కేవలం కొన్ని వర్ష కొలమాన పరికరాలే ఐఎండీ దగ్గర ఉండేవి. కాలక్రమంలో ఆధునిక సాంకేతికతను ఐఎండీ అందిపుచ్చుకుంది. ఐఎండీ 2023 నివేదిక ప్రకారం ఐఎండీ 39 డాప్లర్ వెదర్ రాడార్స్, 15 నిమిషాలకోసారి వివరాలు అందించే ఇన్‌షాట్స్ 3డీఆర్ శాటిలైట్స్, 806 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్, 200 ఆగ్రో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్, 5896 వర్ష నిర్వహణ కేంద్రాలు, 63 పైలట్ బెలూన్ స్టేషన్లను కలిగి ఉంది.
150 ఏండ్ల ప్రస్థానంలో ఐఎండీ కీలకమైన పురోగతిని సాధించింది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను, నిర్దిష్టంగా ఒక గ్రామంలో పడే వర్షపాతం తీరును త్వరితగతిన తెలిపే టెక్నాలజీ, అత్యాధునిక ఉపగ్రహ వ్యవస్థలను సమకూర్చుకుంది. రాగల కొన్ని గంటలతో పాటు మొత్తం సీజన్లో పరిస్థితులను అంచనా వేయగలిగే సాంకేతికతను 2016 నుంచి 2021 మధ్య అందుబాటులోకి తీసుకొచ్చింది. వాతావరణ పరిస్థితులను కచ్చితత్వంతో అంచనా వేయడంలో ప్రపంచంలోనే భారత వాతావరణ విభాగం మూడో స్థానంలో నిలిచింది. భారత వాతావరణ విభాగం హిందూమహా సముద్రతీరంలోని 13 దేశాలతో పాటు, సార్క్ దేశాలకు వాతావరణ సేవలు అందిస్తున్నది.
నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్‌కు ముందస్తు హెచ్చరికలు చేయడం ద్వారా విపత్తుల నుంచి ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు దోహదపడుతున్నది. ఐఎండీ ఆధ్వర్యంలో మిషన్ మౌసమ్ ద్వారా వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో అంచనా వేస్తున్నది. ఇటీవల కృత్రిమ మేధను కూడా ఐఎండీ ఉపయోగించుకుంటున్నది. మౌసమ్ మిషన్‌లో భాగంగా ప్రత్యేక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇందులో కృత్రిమంగా వాతావరణ పరిస్థితులను సృష్టించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా అప్రమత్తం చేయడమే ఐఎండీ దీర్ఘకాలిక లక్ష్యమని భూ విజ్ఞాన శాఖ కార్యదర్శి రవిచంద్రన్ తెలిపారు.