జమ్ము : జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ వీర మరణం పొందాడు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజు జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక పౌరుడికి కూడా గాయాలైనట్టు తెలుస్తున్నది. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు దోడాలోని శివఘడ్-అస్సార్ బెల్ట్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. తొలుత నలుగురు మరణించినట్టు భావించినప్పటికీ ఒక్క ఉగ్రవాదే హతమైనట్టు అధికారులు నిర్ధారించారు. అదనపు డీజీపీ ఆనంద్ జైన్ మాట్లాడుతూ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు. ఆర్మీ కెప్టెన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఉదంపూర్-దోడా-కిష్తార్ రీజియన్‌లో ఇటీవల కాలంలో ఇది నాలుగో ఎన్కౌంటర్. గత నాలుగు నెలల్లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల్లో సుమారు 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.