గోదాముల్లో ధాన్యం నిల్వలు భారీగా మగ్గిపోతున్నాయి. దేశ అవసరాలకు నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని మేమే కొనుగోలు చేయాలంటే కుదరదు. కాబట్టి రైతులు వరి సాగు నుంచి ఇతర పంటలకు మళ్లితే మంచిది. ధాన్యం పండిస్తే ఎగుమతులకు కూడా అవకాశం లేదు. తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం కొనే ప్రసక్తే లేదు.
-2021, డిసెంబర్ 3న పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
సీన్ కట్ చేస్తే.. నాలుగేండ్లకు సరిపడా ధాన్యం ఉన్నదని ప్రగల్భాలు పలికిన కేంద్రం, ఏడాదిన్నరకే బియ్యం కొరత అని గగ్గోలు పెడుతున్నది. పలు రకాల బియ్యం ఎగుమతులను నిషేధించడంతో పాటు మరికొన్నింటిపై ఆంక్షలు విధించింది. ఎగుమతుల నిషేధంతో అంతర్జాతీయంగా బియ్యం ధరలు పైపైకి వెళ్తున్నాయి. మోదీ సర్కార్‌పై ఇటు దేశంతో పాటు అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి.
భారతదేశానికి అన్నపూర్ణగా పేరున్నది. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో 40శాతంతో అగ్రస్థానంలో ఉండే భారత్.. ఇప్పుడు ప్రతి బియ్యం రకం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమ వద్ద ఉన్న పారాబాయిల్డ్ బియ్యాన్ని తీసుకోండని తెలంగాణ ప్రభుత్వం కోరుతూనే ఉన్నా… మాకొద్దని తెగేసి చెప్పిన కేంద్రం.. ఇప్పుడు అదే పారాబాయిల్డ్ రైస్ ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడం కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని చెప్పడానికి నిదర్శనం.
Rice export Ban | న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశ ప్రజల ఆహార అవసరాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలు ఆడుతున్నది. మోదీ సర్కార్ ముందు చూపు లేని నిర్ణయాలతో ప్రజలు తిప్పలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బియ్యం విషయంలో గందరగోళ ప్రకటనలు, నిర్ణయాలతో ప్రజలను కేంద్రం తికమకపెడుతున్నది. నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని ఏడాదిన్నర క్రితం చెప్పిన కేంద్రం.. ఇప్పుడు ధాన్యం కొరతను అంగీకరిస్తున్నది. దేశంలో సరిపడా ధాన్యం ఉంచేలా చూడటంతో పాటు ధరల నియంత్రణ పేరుతో పలు రకాల బియ్యం ఎగుమతులపై నిషేధాలు, ఆంక్షలు విధిస్తున్నది. నెల క్రితం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకొన్నది. తాజాగా ఉప్పుడు(పారాబాయిల్డ్) బియ్యం ఎగుమతులపై 20% పన్ను విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. నూకల ఎగుమతులపై గత ఏడాది కేంద్రం నిషేధం విధించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్.. ఇప్పుడు అన్ని రకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అంతర్జాతీయ వ్యాపారంలో 40% వాటా
అంతర్జాతీయ బియ్యం వ్యాపారంలో భారత్ 40 శాతం వాటా కలిగివున్నది. భారత్ నుంచి అమెరికా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, ఆఫ్రికన్ తదితర దేశాలు పెద్దమొత్తంలో బియ్యం దిగుమతి చేసుకొంటున్నాయి. 2022-23లో భారత్ ఇతర దేశాలకు 177.9 లక్షల టన్నుల బాస్మతీయేత బియ్యం, 45.6 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. బియ్యం ఎగుమతులపై భారత్ నిర్ణయాల వలన పలు దేశాల్లో ఆహార సంక్షోభం పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు
బియ్యం ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ బియ్యం మార్కెట్ కుదుపునకు లోనైంది. బియ్యం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బియ్యం ధరలు 12 ఏండ్ల గరిష్ఠానికి చేరాయి. గత నెల బాస్మతీయేతర తెల్ల బియ్యంపై భారత్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో అమెరికాలో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.
కేంద్రం నిర్ణయాలు..రైతులకు శాపం
కేంద్ర ప్రభుత్వం వరిసాగు వద్దనడంతో చాలా రాష్ర్టాలు సాగును తగ్గించాయి. దీంతో దేశవ్యాప్తంగా సాగు శాతం భారీగా పడిపోయింది. ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంతో వ్యవసాయాన్ని గాడిన పెట్టి, ధాన్యం ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవడం చేతకాని కేంద్రం.. ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కేంద్రం నిర్ణయాలు రైతులకు శాపంగా మారనున్నాయి. ఎగుమతుల కోసం వరి ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తే.. రైతుకు కొంత మేర మంచి ధర లభిస్తుంది. అయితే ఇప్పుడు ఎగుమతులపై నిషేధం, ఆంక్షలు వంటి కారణాలతో వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దీని వలన ధర విషయంలో రైతులు నష్టపోవాల్సి వస్తుంది.
తర్వాత లైన్లో చక్కెర!
రాబోవు రోజుల్లో పంచధార ఎగుమతులపై కూడా భారత్ నిషేధం విధించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కేంద్రం ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై కూడా 40 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.