న్యూఢిల్లీ: అంతర్జాతీయ విద్యా ర్థులను అత్యధికంగా అందచేసే భారత్‌ను అత్యధిక ముప్పు (హయ్యస్ట్ రిస్క్) క్యాటగిరి-అసెస్మెంట్ లెవల్ 3 లేదా ఎల్ 3లోకి ఆస్ట్రేలియా మార్చింది. దీంతో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారతీయ విద్యార్థులు మరిన్ని డాక్యుమెంట్లను సమర్పించడంతోపాటు దరఖాస్తుల పరిశీలన మరింత కఠినంగా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా అసెస్మెంట్ క్యాటగిరీలు మూడు రకాలుగా ఉంటాయి. ఏఎల్1(అతి తక్కువ ముప్పు), ఏఎల్2(కనీస ముప్పు), ఏఎల్3(అత్యధిక ముప్పు)గా ఈ క్యాటగిరీలు ఉండగా భారత్ తాజా మార్పుతో ఏఎల్2 నుంచి ఏఎల్3లోకి మారింది. ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధిక శాతం భారత్‌కు చెందినవారే కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలోని మొత్తం 6.50 లక్షల మంది విదేశీ విద్యార్థులలో 1.40 లక్షల మంది భారతీయులే ఉన్నారు. ఈ మార్పులు 2026 జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి.