Garuda Shakti 2024 : ‘గరుడ శక్తి’ పేరిట భారత్, ఇండోనేషియా ప్రత్యేక బలగాలు ఉమ్మడిగా ప్రదర్శిస్తున్న విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, అవగాహనే లక్ష్యంగా నవంబర్ 1న జకార్తాలో ప్రారంభమైన ఈ ప్రత్యేక దళాల విన్యాసాలు నవంబర్ 12 వరకు కొనసాగుతాయి. భారత్ నుంచి 25 మంది సిబ్బందితో కూడిన బృందం జకార్తాలోని సిజాంటుంగ్కు వెళ్లింది.
భారత ఆర్మీ తరఫున పారాచూట్ రెజిమెంట్ (స్పెషల్ ఫోర్సెస్) నుంచి సైనికులు ప్రాతినిధ్యం వహించగా.. ఇండోనేషియా నుంచి 40 మంది సైనిక సిబ్బందితో కూడిన ప్రత్యేక దళం కొపాసస్ ప్రాతినిధ్యం వహించింది. ‘గరుడ శక్తి 24 (GARUD SHAKTI 24)’లో భాగంగా నిర్వహించిన ఈ విన్యాసాలు ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక దళాల మధ్య పరస్పర అవగాహన, ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి.
ప్రత్యేక ఆపరేషన్లకు ప్రణాళిక, పర్యవేక్షణ, ప్రత్యేక దళాల నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ఆయుధాలు, పరికరాలు, ఆవిష్కరణలు, ఎత్తుగడలపై సమాచారాన్ని పంచుకోవడం వంటివి కీలకాంశాలుగా ఉన్నాయి. ఈ విన్యాసాల ద్వారా అటవీ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు చేపట్టడం, ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు వంటి అంశాలపై ప్రత్యేక దళాల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇరు సైన్యాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ఉత్తమ అభ్యాసాలను పంచుకునే అవకాశం కలుగుతుంది.