న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025) విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశీ దేశాలకు ఆర్థిక సహాయం కింద రూ.5,483 కోట్లు అందజేయనున్నారు. గత ఏడాది సవరించిన రూ.5,806 కోట్ల అంచనాల కంటే కొంచెం తక్కువే. అయితే పొరుగు దేశమైన భూటాన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 బడ్జెట్లో ఆ దేశానికి రూ.2,150 కోట్లు కేటాయించారు. అయితే గత ఏడాది సవరించిన రూ.2,543 కోట్ల కేటాయింపుల కంటే ఇది తక్కువే. అయినప్పటికీ భారత్ కీలక అభివృద్ధి భాగస్వామిగా భూటాన్ నిలిచింది. ఆ దేశంలో మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహకారం కోసం ఈ నిధులు వెచ్చిస్తారు.
కాగా, దౌత్య సంబంధాల పునరుద్ధరణ నేపథ్యంలో మాల్దీవులకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో రూ.470 కోట్లు సహాయాన్ని అందజేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లకు ఇది పెరిగింది. గతం కంటే 28 శాతం అధిక నిధులను ఈ బడ్జెట్లో కేటాయించారు. అయితే రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో నేపాల్ రెండో స్థానంలో ఉండగా, రూ.600 కోట్లతో మాల్దీవులు మూడవ స్థానంలో ఉంది.
మరోవైపు మారిషస్‌కు ఈసారి కోత పడింది. గత బడ్జెట్లో రూ.576 కోట్లు అందుకోగా ఈసారి ఆర్థిక సహాయం రూ.500 కోట్లకు తగ్గింది. మయన్మార్‌కు కూడా రూ.400 కోట్ల నుంచి రూ.350 కోట్లకు నిధులు తగ్గాయి. శ్రీలంకకు రూ.300 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్ల కేటాయింపులో ఎలాంటి మార్పు లేదు.
కాగా, తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కు గత సంవత్సరం రూ.50 కోట్ల ఆర్థిక సహాయాన్ని భారత్ అందజేసింది. 2025-26లో ఈ కేటాయింపులు రెట్టింపై రూ.100 కోట్లకు పెరిగింది. ఆఫ్రికన్ దేశాలకు ఆర్థిక సహాయం కూడా రూ.200 కోట్ల నుంచి రూ.225 కోట్లకు పెరిగాయి. ఇక ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయానికి గతంలో కేటాయించిన రూ.100 కోట్లలో ఎలాంటి మార్పు లేదు.