ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ బాహుబలి రాకెట్ అయిన ఎల్వీఎం3-ఎం5 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహమైన జీశాట్ని అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఏపీలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఏపీలోని శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇస్రో 4,410 కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్ ‘సీఎంఎస్-03’ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నది. ఇందుకోసం 43.5మీటర్ల ఎత్తున్న ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్‌ను ఉపయోగిస్తున్నది. ఇంత బరువైన శాటిలైట్‌ను భారత్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇది భారత భూభాగం సహా భూమిపై సముద్ర ప్రాంతాలకు సంబంధించి కీలక సమాచారాన్ని, బహుళ ప్రయోజనాలతో కూడిన వివిధ రకాల సేవలను సీఎంఎస్-03 అందించనున్నది. ఈ ఉపగ్రహాన్ని జీశాట్ 7ఆర్ (GSAT-7R) అని పిలుస్తుంటారు. ఇది శాటిలైట్‌ను పూర్తిగా భారత సైన్యం అవసరాల కోసం తయారు చేసిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఈ శాటిలైట్ 2013లో ప్రయోగించిన జీశాట్ 7 రుక్మిణి స్థానంలో సేవలు అందించనున్నది. అడ్వాన్స్డ్ పేలోడ్స్‌తో తయారు చేసిన ఈ శాటిలైట్ హిందూ మహాసముద్రంతో పాటు కీలక ప్రాంతాల్లో నేవీ కార్యకలాపాలు కొనసాగించే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నది. వాయిస్, డేటా, వీడియో లింక్‌ల కోసం సీ, ఎక్స్టెండెడ్ సీ, క్యూ-బ్యాండ్స్‌లో కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సైనిక అవసరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోని పౌర ఏజెన్సీలకు సైతం మెరుగైన డిజిటల్ సేవలు అందించడంలో జీశాట్ 7ఆర్ ఉపయోగపడనున్నది.