4 రాఫెల్స్ తగ్గాయ్.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తగ్గిన ఆ విమానాల సంఖ్య
భారత్ వద్ద ప్రస్తుతం 32 రాఫెల్ యుద్ధ విమానాలు మాత్రమే క్రియాశీల సేవల్లో ఉన్నాయని బ్రిటన్కు చెందిన విమానయాన రంగ పత్రిక ‘ఫ్లైట్గ్లోబల్' సంచలన విషయాలు వెల్లడించింది.
- ఐఏఎఫ్ వద్ద 32 విమానాలే
- ‘ఫ్లైట్ గ్లోబల్’ సంచలన వార్త
న్యూఢిల్లీ, నవంబర్ 19 : భారత్ వద్ద ప్రస్తుతం 32 రాఫెల్ యుద్ధ విమానాలు మాత్రమే క్రియాశీల సేవల్లో ఉన్నాయని బ్రిటన్కు చెందిన విమానయాన రంగ పత్రిక ‘ఫ్లైట్గ్లోబల్’ సంచలన విషయాలు వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్-భారత్ మధ్య ఘర్షణలు ముగిసి 18 నెలలు గడిచిన క్రమంలో ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ ఫోర్సెస్ డైరెక్టరీ ప్రకారం.. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో నాలుగు తగ్గి 32 మాత్రమే మనవద్ద ఉన్నట్టు వెల్లడించింది. ఫ్లైట్గ్లోబల్ 2026 ఎడిషన్లో ఈ సంఖ్యను 36 నుంచి 35కు తగ్గించింది. దృశ్య ఆధారాలతో నిర్ధారణ అయిన ఒక విమాన నష్టాన్ని మాత్రమే అప్పట్లో పరిగణనలోకి తీసుకుంది. ఇతర విమానాలను కూల్చివేశామంటూ పాకిస్థాన్ చేసిన వాదనలను ధ్రువీకరించనవిగా పేర్కొంది. తాజా గణాంకాల్లో మాత్రం క్రియాశీల విమానాల సంఖ్య మరో మూడుకు తగ్గించి 32కు చేర్చింది. సిరియం సైనిక విమానాల డాటాబేస్ ఆధారంగా ఈ వివరాలను రూపొందించారు. దీంతో రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్యపై మరోసారి చర్చ ప్రారంభమైంది. భారత వైమానిక దళం వద్ద సుఖోయ్ విమానాల సంఖ్యను కూడా ఈ సంస్థ తాజా నివేదికలో తగ్గించి చూపింది. భారత్ మొత్తం 272 విమానాలను కొనుగోలు చేయగా, ప్రమాదాల్లో 14 విమానాలను కోల్పోయి 258 మాత్రమే ఉన్నట్టు తాజా నివేదిక తెలిపింది.
నష్టాలపై భిన్న వాదనలు
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా నాలుగు రోజుల పాటు సాగిన ఉద్రిక్తతల్లో ఇరుదేశాల వైమానిక దళాలకు జరిగిన నష్టాలపై భారత్, పాకిస్థాన్ వాదనలు భిన్నంగా ఉన్నాయి. భారత్ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ ప్రకటించగా, భారత్ నష్టపోయిన విమానాల సంఖ్యను అధికారికంగా వెల్లడించ లేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానయాన విశ్లేషకులు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని విమానాల క్రియాశీల స్థితిని అంచనా వేస్తున్నారు. సిరియం సంస్థ ప్రతి విమానాన్ని దాని ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధారంగా పర్యవేక్షిస్తుంది. బహిరంగంగా లభించే విమానాల వీక్షణ సమాచారం, ఫ్లైట్ట్రాకింగ్ వివరాలు, రక్షణ రంగ నివేదికలను పరిశీలిస్తుంది. ఏదైనా విమానం దీర్ఘకాలిక మరమ్మతులు, నిర్మాణపరమైన పునరుద్ధరణ, ఆధునీకరణ కోసం ఫ్రాన్స్ లేదా భారత్లోని కేంద్రాల్లో ఉంటే ఏడాది పాటు క్రియాశీలక స్కాడ్రన్లో కన్పించకపోతే దాని స్థితిని క్రియాశీల సేవలు నుంచి నిల్వ/నిర్వహణ విభాగానికి మార్చే అవకాశం ఉంది. అందువల్ల క్రియాశీల విమానాల సంఖ్య తగ్గినంత మాత్రాన అవన్నీ యుద్ధంలో కూలిపోయినట్టు కాదని నిపుణులు అంటున్నారు. విమానాల సీరియల్ నెంబర్లు, ఏ కారణాలతో వాటిని క్రియాశీల జాబితా నుంచి తొలగించానన్న వివరాలను ఆ డైరెక్టరీ వెల్లడించ లేదు. ఈ గణాంకాలను ప్రభుత్వ అధికారిక ప్రకటనలుగా కాకుండా, అందుబాటులో ఉన్న సమాచారంతో రూపొందించిన అంచనాలతో చూడాలని స్పష్టం చేసింది.
ఐదు విమానాలు కూలాయన్న ట్రంప్
ఆపరేషన్ సిందూర్ తర్వాత 2025 జూలైలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేశారు. భారత్-పాక్ ఘర్షణల్లో సుమారు ఐదు విమానాలు కూలిపోయాయని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ కొన్ని విమానాలను కోల్పోయిన విషయాన్ని ఉన్నతాధికారులు అంగీకరించారు. అయితే వాటి సంఖ్యను మాత్రం తెలియజేయలేదు. కాగా, భారత్ ఇప్పటివరకు కొనుగోలు చేసిన 36 రాఫెల్ విమానాల్లో 28 సింగిల్ సీటర్, ఎనిమిది రెండు సీట్ల విమానాలు ఉన్నాయి. మరో 114 విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదన కూడా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

