న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్థాన్‌ను నిలదీసేందుకు భారత ఎంపీల బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాకు వెళ్లిన బృందంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఉన్నారు. ఆయన అక్కడ మాట్లాడుతూ.. భారత్‌లో 24 కోట్ల మంది ముస్లింలు జీవిస్తున్నారని, ఇది గర్వకారణమన్నారు. భారత్‌లో ఎంతో మంది ఇస్లామిక్ పండితులు ఉన్నట్లు ఆయన చెప్పారు. తామే ముస్లిం దేశస్థులమని అరబ్ ప్రపంచాన్ని పాకిస్థాన్ తప్పుదోవ పట్టిస్తోందని, ఇండియా ముస్లింలకు వ్యతిరేకమన్న సంకేతాన్ని ఆ దేశం ఇస్తున్నదని ఆరోపించారు.
ఇండియాలో 24 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఇక్కడ ఉన్న ఇస్లామిక్ పండితులు మరెక్కడా లేరన్నారు. అత్యుత్తమైన అరబిక్ భాషను మాట్లాడుతారని చెప్పారు. ముస్లిం దేశం కావడం వల్లే పాకిస్థాన్‌ను ఇండియా వేధిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అసదుద్దీన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ఒకవేళ ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం నిలిపివేస్తే, అప్పుడు దక్షిణాసియాలో స్థిరత్వం వస్తుందన్నారు.