న్యూఢిల్లీ: భారత జాతీయుల, సంస్థలకు చెందిన స్విస్ బ్యాంకు(Swiss bank account details) వివరాలు మరికొన్ని రిలీజ్ అయ్యాయి. స్విట్జర్లాండ్‌తో ఉన్న ఆటోమెటిక్ సమాచార మార్పిడిలో భాగంగా తాజాగా నాలుగవ సెట్ వివరాలు భారత్‌కు అందాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు 101 దేశాలకు చెందిన 34 లక్షల ఫైనాన్షియల్ అకౌంట్స్ వివరాలను స్విస్ అధికారులు రిలీజ్ చేశారు. అయితే 4వ సెట్లో భాగంగా భారత్‌కు చెందిన వందలాది మంది ఫైనాన్షియల్ అకౌంట్ల వివరాలను అందజేసినట్లు అధికారులు చెప్పారు. కొందరు వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టీలకు మల్టిపుల్ అకౌంట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
స్విస్ బ్యాంకులో ఖాతా ఉన్న భారతీయుల రహస్య సమాచారన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ ఆ డేటాతో పన్ను ఎగవేత కేసులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, టెర్రర్ ఫండింగ్ కేసుల్ని కూడా ఆ స్విస్ డేటాతో చెక్ చేయనున్నారు. స్విస్‌కు చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కొత్త జాబితాకు చెందిన వివరాలను ప్రకటించింది. అల్బేనియా, బ్రూనై దరుసలాం, నైజీరియా, పెరూ, టర్కీ లాంటి దేశాలు కూడా కొత్త లిస్టులో కలిశాయి. గత నెలలో స్విస్ తన వద్ద ఉన్న సమాచారాన్ని భారత్‌కు అందజేసింది. మళ్లీ సెప్టెంబర్ 2023లో కొత్త ఇన్ఫర్మేషన్ను రిలీజ్ చేయనున్నారు.
ఆటోమెటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం 2019 సెప్టెంబర్‌లో తొలిసారి భారత్‌కు స్విస్ అకౌంట్ల సమాచారం చేరింది. ఆ సంవత్సరం 75 దేశాలకు ఇన్ఫర్మేషన్ అందింది. గత ఏడాది 86 దేశాలకు ఆ సమాచారం చేరవేశారు. ఏఈఓఐ ఇచ్చిన సమాచారం ప్రకారమే.. భారత్‌లో పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వం కొరఢా విసిరినట్లు అర్థమవుతోంది.