Bharatmala project | న్యూఢిల్లీ: క్విడ్ ప్రోకో.. కొన్నేండ్లుగా ఈ పదం తెలుగు రాష్ర్టాల్లో అందరికీ సుపరిచితమైంది. దీని అర్థం ‘అర్హత లేనివారికి లబ్ధి చేకూర్చి వారి నుంచి అయాచితంగా తిరిగి లబ్ధి పొందటం’. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నదని మరోసారి స్పష్టమైంది. భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం కేటాయించిన జాతీయ రహదారుల నిర్మాణ కాంట్రాక్టుల్లో చాలావరకు బీజేపీ నేతలు, వారి సన్నిహతుల చేతుల్లోకే వెళ్లాయి. అవి కూడా కనీస అర్హత లేని కంపెనీలకే భారీ ప్రాజెక్టులు కట్టబెట్టారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్వయంగా తేల్చింది. ఈ అర్హత లేని కంపెనీల్లో ప్రధాని మోదీ స్నేహితుడు అదానీ కంపెనీలు కూడా ఉన్నాయి.
అదానీకి సూర్యాపేట-ఖమ్మం రహదారి
భారత్‌మాల పరియోజన మొదటి దశలో రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకొన్న నాలుగు సంస్థలు అధికార బీజేపీకి భూరి విరాళాలు ఇచ్చినట్టు తేలింది. ఈ కంపెనీలకు అర్హత లేకున్నా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) కాంట్రాక్టులు కట్టబెట్టిందని ఇటీవల కాగ్ తూర్పారబట్టింది. అదానీకి చెందిన అదానీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మరికొన్ని సంస్థలతో కలిసి కన్సార్షియంగా ఏర్పడి సూర్యాపేట-ఖమ్మం మధ్య జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రాజెక్టును దక్కించుకొన్నాయి. ఈ కాంట్రాక్టు విలువ రూ.1,566.30 కోట్లు. అయితే అదానీ కంపెనీకి అసలు రోడ్ల నిర్మాణ అనుభవం ఏమాత్రం లేదు. అయినా ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టు అప్పగించేసింది. కాంట్రాక్టు కోసం సూర్యాపేట-ఖమ్మం రోడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుకొన్న దరఖాస్తులో నిర్మాణ అనుభవం అనేచోట ‘మరో ఇతర కంపెనీ’ అని పేర్కొన్నది. ఆ ‘మరో కంపెనీ’ అనేది ఏదీ లేదని, ఆ కన్సార్షియంలో దేనికీ రోడ్ల నిర్మాణ అనుభవం లేదని కాగ్ కుండబద్ధలు కొట్టింది.
ఈ కాంట్రాక్టు కోసం బిడ్ వేయాలంటే కంపెనీ నెట్వర్క్ రూ.304.33 కోట్లు ఉండాలి. కానీ ఇందుకు సంబంధించి కంపెనీ సమర్పించిన చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ కూడా థర్డ్ పార్టీదేనని కాగ్ తేల్చింది. ఈ కన్సార్షియంలో అదానీ కంపెనీదే 74 శాతం వాటా. అంటే, కన్సార్షియంలోని మిగతా కంపెనీలు నామమాత్రమే. అలాంటప్పుడు ‘మరో కంపెనీ’ అని చెప్తున్న కంపెనీకి నిర్మాణ అర్హత ఉండే అవకాశమే లేదని కాగ్ అభిప్రాయపడింది. నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే బిడ్ వేసే కంపెనీకి 5 ఏండ్ల అనుభవం ఉండాలి. కానీ అదానీ ట్రాన్స్పోర్ట్కు ఈ రంగంలో అనుభవం శూన్యం. అయినా, ఎన్హెచ్ఏఐ ఈ కంపెనీకే కాంట్రాక్టు కట్టబెట్టడం విశేషం. 2019 మార్చిలో ఈ ప్రాజెక్టు బిడ్లు ఖరారు చేసే సమయంలో అదానీ కంపెనీకి కాంట్రాక్టు ఖరారు చేస్తూ ఎన్హెచ్ఏఐ ‘రికార్డులు పరిశీలించాల్సిన అవసరం లేదు. సాంకేతికంగా అంతా సరిగ్గానే ఉన్నది’ అని ప్రకటించటం కొసమెరుపు. భారత్‌మాల పరియోజనలో భాగంగా చేపడుతున్న ఈ రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 40 శాతం నిధులిస్తుంది. మిగతా 60 శాతం కాంట్రాక్టు కంపెనీ భరించాల్సి ఉంటుంది.
Roads
రింగు తిరిగిన సొమ్ము
హర్పూర్-మొరాదాబాద్ జాతీయ రహదారి ప్రాజెక్టుది మరో కథ. ఈ టెండర్‌ను ఏకంగా 68 శాతం తక్కువ ప్రీమియంకే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్‌కు ఎన్హెచ్ఏఐ కట్టబెట్టింది. 22 ఏండ్ల కాలానికి నిర్ణయించిన ఈ రోడ్డు ప్రాజెక్టుకు మొదట టెండర్లు పిలిచారు. ఈ టెండర్ దక్కించుకొన్న కంపెనీ ఏటా ఎన్హెచ్ఏఐకి రూ.97.77 కోట్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని నిర్దేశించారు. ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్టుకోసం పోటీ పడే కంపెనీలు ఎన్హెచ్ఏఐ నిర్ణయించిన ప్రీమియంకంటే ఎక్కువకు కోట్ చేయాలి. 2018 మార్చిలో ఐఆర్బీ ఇన్ఫ్రాకు రూ.31.50 కోట్ల వార్షిక ప్రీమియానికే ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టును కట్టబెట్టింది. అంటే మొదట నిర్ణయించిన ప్రీమియం కంటే ఇది 68 శాతం తక్కువ. కనీస ప్రీమియంకంటే మూడింతలు తక్కువ ఇవ్వటానికి సిద్ధపడ్డ కంపెనీకి టెండర్ ఖరారు చేశారని కాగ్ తూర్పారబట్టింది. ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు (ట్రాఫిక్) భారీగా ఉండదని కన్సల్టింగ్ సంస్థ అంచనా వేయటమేనని ఎన్హెచ్ఏఐ కారణంగా చెప్పింది. టెండర్ దక్కించుకొన్న ఐఆర్బీ సంస్థ ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.3,345 కోట్లు అని తన వెబ్సైట్లోనే పేర్కొనటం గమనార్హం. ఈ విషయంపైనే కాగ్ ప్రశ్నలు లేవనెత్తింది. ‘బిడ్ల దాఖలుకు వారం రోజుల ముందే ఎన్హెచ్ఏఐ తన దృక్పథాన్ని మార్చుకొన్నది. ఎలాంటి సహేతుక కారణాలు లేకుండానే ముందుగా వేసిన తన అంచనాలు తప్పు అని అంగీకరించింది. ఇలాంటి సమయంలో పాత టెండర్లను రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలువాలి. కానీ, ఎన్హెచ్ఏఐ ఆ పని కూడా చేయలేదు’ అని ధ్వజమెత్తింది.
అర్హత లేకున్నా జే కుమార్‌కు భారీ ప్రాజెక్టు
జే కుమార్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ అనే మరో కంపెనీకి కూడా ఎన్హెచ్ఐఏ ఇలాగే అక్రమంగా ప్రాజెక్టు కట్టబెట్టిందని కాగ్ తేల్చింది. 2018 డిసెంబర్లో జే కుమార్ ఇన్ఫ్రాకు 1,349 కోట్ల విలువైన ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే ప్యాకేజీ-1 పనులను అప్పగించారు. అయితే, ఈ ప్రాజెక్టు కోసం బిడ్ దాఖలు చేసేందుకు కూడా ఈ కంపెనీకి అర్హత లేదని తేలింది. ఢిల్లీ-వడోదరా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులోని ప్యాకేజీ 17 నుంచి 25 వరకు పనులను ఎంకేసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్అండ్ టీ, జియాంగ్జీ కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ కార్పొరేషన్, జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, జీహెచ్‌వీ ఇండియా కంపెనీలతో కూడిన కన్సార్షియంకు కట్టబెట్టారు. ఈ టెండర్లలో కూడా నిబంధనలు పాటించలేదని కాగ్ తూర్పారబట్టింది. ఈ ప్రాజెక్టును మొత్తం 31 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో 2019-20 మధ్య కేటాయించిన కనీసం 8 ప్యాకేజీ టెండర్లలో అక్రమాలు జరిగాయని కాగ్ కుండబద్ధలు కొట్టింది. సరైన అంచనాలు రూపొందించకుండానే ఎన్హెచ్ఏఐ టెండర్లు ఖరారు చేసిందని మండిపడింది.
బీజేపీ నేతకు అప్పనంగా అప్పగింత
భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా మరో కాంట్రాక్టు ఓ బీజేపీ నేత, ఆగ్రా మేయర్‌కు కట్టబెట్టిన తీరైతే మరీ విచిత్రం. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరం చుట్టూ రింగురోడ్డు నిర్మాణం ప్యాకేజీ -1 పనులను బీజేపీ నేత నవీన్ జైన్‌కు చెందిన పీఎన్సీ ఇన్ఫోటెక్ సంస్థకు కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ.904.31 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ మొదట అంచనా వేసింది. ఖర్చులు పెరిగితే సవరించిన అంచనాలు మరో 2.2 శాతం పెరుగొచ్చని పేర్కొన్నది. కానీ, అంచనా మొత్తాన్ని ఏకంగా 17.44 శాతం అధికంగా పెంచి రూ.1,062 కోట్లకు ఈ ప్రాజెక్టు పనులను పీఎన్సీ ఇన్ఫ్రాకు 2019 ఆగస్టులో కట్టబెట్టింది. ఈ మొత్తం సవరించిన అంచనాలకంటే కూడా ఎక్కువ.
అసలు కథ ఇదీ..