న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : పట్టభద్రులలో 42.6 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హులని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. 2023లో ఇది 44.3 శాతం ఉండగా గత ఏడాదికి 42.6 శాతానికి తగ్గినట్టు మెర్సెర్ మెటెల్ టాలెంట్ అసెస్మెంట్ కంపెనీ వెల్లడించింది. మెర్సెర్ మెటెల్ బుధవారం విడుదల చేసిన భారతదేశ గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025 ప్రకారం ఢిల్లీలో అత్యధికంగా 53.4 శాతం ఉద్యోగార్హులు ఉండగా 51 శాతంతో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఉన్నాయి. 31 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 2,700కిపైగా క్యాంపస్లకు చెందిన 10 లక్షల మంది విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించినట్టు మెర్సెర్ మెటెల్ తెలిపింది. టైర్-1 కళాశాలకు చెందిన గ్రాడ్యుయేట్లు టెక్నికల్, నాన్-టెక్నికల్ స్కిల్స్లో అధిక ఉద్యోగార్హతను ప్రదర్శించారని పేర్కొంది. టైర్ 2, టైర్ 3 కళాశాలల్లోని గ్రాడ్యుయేట్లు తమ నైపుణ్యాల ప్రదర్శనలో వెనుకబడి ఉన్నారని తెలిపింది. అనలిస్టులు, హెచ్ఆర్, డిజిటల్ మార్కెటింగ్ వంటి నాన్ టెక్నికల్ రంగాలలో గ్రాడ్యుయేట్ల ఉద్యోగార్హత 2023లో 48.3 శాతం ఉండగా 2024లో 43.5 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొన్నది. టెక్నికల్, నాన్ టెక్నికల్తోపాటు సాఫ్ట్ స్కిల్స్ ఉన్న గ్రాడ్యుయేట్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది.