బెంగళూరు : గుండె శస్త్ర చికిత్స కోసం దవాఖానలో చేరిన మహిళ (38)కి తగిన రక్తం దొరకకపోవడంతో వైద్యులు అవాక్కయ్యారు. ఆమెకు ప్రస్తుతం తెలిసిన బ్లడ్ గ్రూప్‌లలో ఏదీ సరిపోలేదు. ఇది అత్యంత అరుదైన రకం రక్తమని 10 నెలల పరీక్షల అనంతరం నిర్ధారణ అయింది. దీంతో ఆమె పేరు వైద్య చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ మహిళను నిరుడు కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఆర్ఎల్ జాలప్ప దవాఖానలో చేర్పించారు. ఆమెకు ఓ-పాజిటివ్ రక్తం ఉందని భావించారు.
శస్త్ర చికిత్సలో ఉపయోగించడం కోసం అన్ని రకాల బ్లడ్ గ్రూపుల రక్తంతో పరిశీలించారు. కానీ ఏదీ మ్యాచ్ కాలేదు. ఆమె రక్త నమూనాను రోటరీ బెంగళూరు టీటీకే బ్లడ్ సెంటర్‌కు పంపించారు. అన్ని ప్రామాణిక రకాల రక్తం ఆమె రక్తానికి సరిపోవడం లేదని వారు కూడా గుర్తించారు. నిర్ధారణ కానటువంటి రకానికి చెందిన రక్తం ఆమెకు ఉన్నట్లు నిపుణులు గమనించారు. ఆమె కుటుంబ సభ్యుల్లో 20 మంది రక్తాన్ని కూడా పరిశీలించారు. అయినా సానుకూలత కనిపించలేదు. దీంతో వైద్యులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆమెకు గుండె శస్త్ర చికిత్స చేశారు.
ఆమె రక్త నమూనాలను బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో ఉన్న ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఈ ల్యాబ్ 10 నెలలపాటు ఆమె రక్తంపై అధ్యయనం చేసింది. క్రోమర్ సిస్టమ్‌లో ఓ కొత్త యాంటీజెన్ (బాహ్య పదార్థం) ఉందని నిపుణులు గుర్తించారు. క్రోమర్, భారత దేశంలోని బెంగళూరులను కలుపుతూ సీఆర్ఐబీ అని ఈ కొత్త రకం రక్తానికి నామకరణం చేశారు. ఈ యాంటీజెన్ ప్రపంచంలో తొలిసారి కనిపించింది.