న్యూఢిల్లీ, డిసెంబర్ 25: బలగాల కోసం 120 ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో వీటిని మోహరించనున్నది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల ఈ క్షిపణి.. 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. రాడార్, కమ్యూనికేషన్ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను లక్ష్యంగా చేసుకొనేందుకు వీటిని రూపొందించారు.
ఈ అధునాతన క్షిపణులు శత్రుదేశాల ఇంటర్సెప్టార్ మిస్సైళ్ల కళ్లుగప్పి తమ దిశను మార్చుకోగలవు. 2015లో డీఆర్డీవో ఈ క్షిపణుల అభివృద్ధిని చేపట్టింది. గత ఏడాది డిసెంబర్ 21, 22న ఈ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. వీటిని తొలుత వాయుసేనలో, తర్వాత ఆర్మీలోకి ప్రవేశపెట్టాలని రక్షణ శాఖ భావిస్తున్నది.